వేములవాడలో ‘దళారి’ మూవీ టీజర్ లాంచ్
వేములవాడ: ‘దళారి’ సినిమా టీం సభ్యులు వేములవాడలో సందడి చేశారు. ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ సింగర్స్ నిర్వహించిన గూగులమ్మతల్లి బోనాలు కార్యక్రమంలో ‘దళారి’ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో దళారి సినిమా హీరో షకలక శంకర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీజర్ లాంచ్ అనంతరం చిత్ర దర్శకుడు కాచిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ కరీంనగర్ జిల్లా బిడ్డగా ఈ దళారి సినిమాను అందరిని మెప్పించేలా అద్భుతమైన కథతో తెరకెక్కించానని, ఈ సినిమాను అందరూ ఆదరించాలని అన్నారు.
హీరో షకలక శంకర్ మాట్లాడుతూ ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నానని దర్శకుడు గోపాల్ రెడ్డి గారు కథ చెప్పినప్పుడే ఈ సినిమా ఎంతో ఆకట్టుకుందని, నిర్మాత వెంకట్ రెడ్డి గారు ఈ సినిమాకు నిర్మాతగా ఎక్కడ రాజీ పడకుండా చిత్ర నిర్మాణం పూర్తి చేశారని ఈ సినిమా మీ అందరిని ఆకట్టుకుంటుందని అన్నారు. జానపదానికి వన్నెతెచ్చిన జిల్లా కరీంనగర్ అని మా శ్రీకాకుళం, కరీంనగర్ ఉద్యమాలకు, కళాకారులకు పుట్టినల్లని అన్నారు. గూగులమ్మతల్లి బోనాలు ఆకట్టుకున్నాయని ఇక్కడి కళాకారులకు సినిమాల్లో అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు.
ఇక నిర్మాత వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ సినిమాలో కథ, పాటలు, డ్యాన్సులు, ఎమోషన్స్ ప్రతిది ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుందని ఈ జిల్లా బిడ్డగా నిర్మించిన దళారి సినిమాని ఆదరించాలని కోరారు.
సినీ గాయని మధుప్రియ మాట్లాడుతూ సినిమా టీజర్ ఎంతో బాగుందని సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అన్నారు.
ఐ.టి.ఎఫ్ నిర్వాహకులు జి.ఎల్ నాందేవ్ మాట్లాడుతూ సినిమా హిట్ కావాలని మన జిల్లా నుంచి వస్తున్న ఈ సినిమాను మన జిల్లాలోని ప్రతి కళాకారుడు సపోర్ట్ చేయాలన్నారు. ఓరుగంటి శేఖర్ మాట్లాడుతూ మన జిల్లా నుండి ఒక పెద్ద సినిమా రావడం అభినందనీయమని, సినిమా టీజర్ దుమ్ములేపేలా ఉందని చెబుతూ ఆటపాటలతో సభను ఉర్రుతలూగించారు.
నిర్మాత ఎడవెల్లి వెంకటరెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న దళారి సినిమాకి కాచిడి గోపాల్ రెడ్డి గారు రచన దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా షకలక శంకర్, అక్సఖాన్, రూపిక నటించగా ప్రధాన పాత్రలో రాజీవ్ కనకాల నటించారు. ఇక ఇతర పాత్రల్లో గెటప్ శ్రీను, రాంప్రసాద్, రచ్చ రవి నటిస్తున్నారు. సంగీతం గౌర హరి, కెమెరామెన్ మెంటం సతీష్, పాటలు సుద్దాల అశోక్ తేజ, సురేష్ ఉపాధ్యాయ అందించారు. ప్రొడక్షన్ కంట్రోలర్ అల్లూరి రాము. ఈ సినిమాను మార్చిలో రిలీజ్ చేస్తున్నట్టు సినిమా నిర్మాత తెలిపారు.