ఎవరినైనా మర్చిపోతామేమో కానీ..
చిన్ననాటి స్నేహితుల్ని కాదు.. : డైరెక్టర్‌ మారుతి

‘‘బాల్యం నుంచి ప్రతి దశలోనూ మన జీవితంలో ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు. కాలక్రమంలో అందులో కొందరిని మనం మర్చిపోవడం సహజం. కానీ జీవితపు తొలి దశలో ప్రేమాభిమానాలు కురిపించే బాల్య స్నేహితులను మాత్రం కాదు’’ అన్నారు యువ దర్శకులు మారుతి.
మచిలీపట్నం జార్జికారనేషన్‌ హైస్కూల్‌కు చెందిన ఆయన బాల్య స్నేహితులు గెట్‌టు గెదర్‌ కార్యక్రమంతో పాటు, స్వయంకృషితో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న తమ చిన్ననాటి స్నేహితుడు మారుతిని ప్రేమగా సత్కరించుకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్టర్‌గా క్షణం తీరిక లేకుండా ఉన్న ఆయన ఈ కార్యక్రమానికి విచ్చేసి దాదాపు 4 గంటల పాటు చిన్ననాటి స్నేహితులను పేరు పేరునా పలకరించి, వారితో గడపడం విశేషం.
ఈ సందర్భంగా తన చిన్ననాటి సంఘటనలను, తాను కష్టపడి ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగిన విధానాన్ని వివరించడంతో పాటు, తన స్నేహితులు ఎవరెవరు ఏఏ రంగాల్లో ఉన్నారు. వారు కూడా జీవితంలో ఎదగటానికి ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించి, సన్మానపత్రం కూడా అందజేశారు.
ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథులుగా 30 సంవత్సరాల క్రితం జార్జికారనేషన్‌ స్కూల్లో తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను ఆహ్వానించి, వారికి గౌరవ సత్కారం చేశారు.
‘ఈరోజుల్లో..’ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటి.. ‘బస్టాప్‌’, ‘ప్రేమకథా చిత్రమ్‌’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘బాబు బంగారం’, ‘కొత్త జంట’. ‘ప్రతిరోజూ పండగే’ ‘మహానుభావుడు’, ‘పక్కా కమర్షియల్‌’ ఇలా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు మారుతి. ప్రస్తుతం ఆయన ఇండియన్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ఓ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఘన విజయం సాధించి తమ స్నేహితుడు మారుతి కూడా ఇండియన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్టర్‌గా ఎదగాలని ఆయన స్నేహితులు ముక్త కంఠంతో కోరుకున్నారు. అలాగే ఈనెల 8న పుట్టిన రోజు జరుపుకుంటున్న మారుతికి అడ్వాన్స్‌డ్‌ బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు.

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *