ఘనంగా రామ్ గోపాల్ వర్మ “వ్యూహం”, “శపథం” సినిమాల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 23న “వ్యూహం”, మార్చి 1న “శపథం” థియేట్రికల్ రిలీజ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను నేపథ్యంగా తీసుకుని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమాలు “వ్యూహం”, “శపథం”. ఈ సినిమాలను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీస్ లో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. సెన్సార్ అడ్డంకులు దాటుకున్న “వ్యూహం” ఈ నెల 23న, “శపథం” మార్చి 1న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతున్నాయి. ఈ సినిమాల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – “వ్యూహం”, “శపథం” సినిమాల రిలీజ్ విషయంలో నేను థ్యాంక్స్ చెప్పాల్సిన ఒకే ఒక వ్యక్తి నారా లోకేష్. నేను, దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాలను డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. లోకేష్ కోర్టుకు వెళ్లి మా సినిమా రిలీజ్ ను అడ్డుకున్నారు. ఇప్పుడు సరిగ్గా ఎలక్షన్స్ కు ముందు మా రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా పరోక్షంగా హెల్ప్ చేసింది నారా లోకేష్. అందుకే ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. డిసెంబర్ లో రిలీజ్ అయి ఉంటే ఈపాటికి జనం మర్చిపోయేవారు. నేను ముందు నుంచీ చెబుతున్నా..ఎవరైనా ఏ సినిమానైనా రిలీజ్ ను కొన్నాళ్లు ఆపించగలరు గానీ శాశ్వతంగా సినిమా రిలీజ్ కాకుండా ఆపలేరు. వారం రోజుల తేడాలో రెండు సినిమాలు రిలీజ్ కావడం వల్ల ఇబ్బందే ఉండదు. నచ్చితే రెండు సినిమాలూ చూస్తారు. నచ్చకుంటే రెండూ చూడరు. సెన్సార్ అనేది ఔట్ డేటెడ్ వ్యవస్థ. ఏ కథ తీసినా వాళ్లకు అభ్యంతరాలు ఉంటాయి. ఈ సినిమాలో కొన్ని సీన్స్ తీసేశారు. అయినా కథలోని ఎమోషనల్ కంటెంట్ మిస్ కాలేదు. ప్రజా జీవితంలో ఉన్న కొందరి మీద మనకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అలా నాకు ఉన్న అభిప్రాయాలతో వాస్తవ ఘటనల నేపథ్యంగా నేను వ్యక్తీకరించిన సినిమాలే వ్యూహం, శపథం. ఈ సినిమాలు ఎవరి మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది నేను చెప్పలేను. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఫిలిం మేకర్ కు వాస్తవ ఘటనలను తన కోణంలో తెరకెక్కించే స్వేచ్ఛ ఉందని హైకోర్టు మాకు ఇచ్చిన ఆర్డర్స్ లో పేర్కొంది. వైఎస్ గారి మృతి నుంచి వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేవరకు వ్యూహం కథ ఉంటుంది. జగన్ సీఎం ప్రమాణ స్వీకారం నుంచి చంద్రబాబు జైలుకు వెళ్లేవరకు శపథం కథ చూపిస్తున్నాం. నేను ఈ సినిమాను జగన్ కోసం కాదు పవన్, చంద్రబాబు కోసం తీశాను. అన్నారు.
నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ – “వ్యూహం”, “శపథం” సినిమాల రిలీజ్ విషయంలో దేవుడు మాకు అన్నీ కలిసొచ్చేలా చేశాడని అనుకుంటున్నాం. ఈ రెండు సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నాం. ఆ టైమ్ లో పెద్ద సినిమాల రిలీజ్ లేవు. రెండు సినిమాలు గ్యారెంటీగా సక్సెస్ అవుతాయి. ఈ రెండు సినిమాలు మొదలుపెట్టినప్పుడే రిలీజ్ కు అడ్డంకులు వస్తాయని తెలుసు. తెలిసే ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశాం. ఎన్నికలు సమీపిస్తున్నా..లోకేష్ పార్టీ కార్యక్రమాలు అన్నీ వదిలి మా సినిమాలు రిలీజ్ కాకుండా కోర్టులకు, సెన్సార్ ఆఫీస్ లకు ఫిర్యాదులు చేశాడు. రోడ్లపై ధర్నాలు చేయించాడు. ఆయన అంత పోరాటం చేశాడంటేనే మా సినిమాల్లో ఎంత స్ట్రాంగ్ కంటెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కాస్ట్లీ లాయర్స్ తో కోర్టుల్లో వాదించారు. అయినా మాకు ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటూ న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ధర్మం గెలిచిందని మేము భావిస్తున్నాం. అన్నారు.
నటీనటులు – అజ్మల్, మానస తదితరులు
టెక్నికల్ టీమ్ – డీవోపీ – సుజీష్ రాజేంద్రన్, ఎడిటర్– మనీష్ ఠాకూర్, పిఆర్వో– శివమల్లాల, నిర్మాత – దాసరి కిరణ్ కుమార్, దర్శకత్వం – రామ్ గోపాల్ వర్మ