కలలు కనటానికి ఎన్ని రాత్రులు ఉంటాయో.. వాటిని నిజం చేసుకోవటానికి అన్ని పగళ్లు ఉంటాయి
అని చెప్పేదే మా ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ ` ఎస్‌.వి. కృష్ణారెడ్డి

యూత్‌, మెసేజ్‌, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డ్కెరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ`హైబ్రిడ్‌ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, ప్రఖ్యాత బ్యానర్‌ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌`మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాశారు. మార్చి 3న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు దర్శకులు ఎస్‌.వి. కృష్ణారెడ్డి…

గతంలో ఎటువంటి అంచనాలు లేని ఆలీని ‘యమలీల’తో హీరోను చేశారు.. ఈ సినిమా సోహైల్‌కు ఎంత వరకు ఉపయోగ పడుతుంది?
ఖచ్చితంగా అతను పెద్ద హీరో అవుతాడు. ఈమాట నేను షూటింగ్‌లోను.. పలు సందర్భాలలో అతనికి చెప్పాను. కలలు కనటానికి ఎన్ని రాత్రుళ్లు ఉంటాయో.. వాటిని నిజం చేసుకోవటానికి అన్ని పగళ్లు ఉంటాయి. ఈ సత్యాన్ని సోహైల్‌ క్యారెక్టర్‌ ద్వారా చెప్పాము. మనసుకు హత్తుకుపోయే క్యారెక్టర్‌ అతనిది. అతని పాత్రకు అనుగుణంగానే మిగిలిన పాత్రలు బిహేవ్‌ చేస్తాయి.
దాదాపు ఇండస్ట్రీలోని కమెడియన్‌లు అందరినీ పెట్టారు.. కామెడీకి అంత స్కోప్‌ ఉందా?
అవునండి. సోహైల్‌ క్యారెక్టర్‌ ద్వారా అంతర్లీనంగా ఒక మంచి మెసేజ్‌ను చెపుతూనే.. ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించేలా స్క్రీన్‌ప్లే రాశాను. నా గత చిత్రాలు మాయలోడు, వినోదం, పెళ్లాం ఊరెళితే.. చిత్రాల తరహాలోనే హిలేరియస్‌ కామెడీ ఉంటుంది. అందుకే అంత మంది అద్భుతమైన కమెడియన్‌లను తీసుకున్నాం. మా లక్ష్యం ఒక్కటే.. ప్రేక్షకుల గుండెలను బరువెక్కిస్తూనే.. వారిని రిలాక్స్‌ చేయడం కోసం మళ్లీ కామెడీ పూతలు పూస్తూనే ఉంటాం.
దాదాపు దశాబ్దం గ్యాప్‌ తర్వాత మళ్లీ ప్రేక్షకులకు ముందుకు వస్తున్న కృష్ణారెడ్డి గారు తనను తాను ఎలా ప్రూవ్‌ చేసుకోబోతున్నారు?
మీరు చెప్పినట్టు కృష్ణారెడ్డికి గ్యాప్‌ వచ్చిన మాట వాస్తవమే.. కానీ బంధాలకు.. అనుబంధాలకు.. సెంటిమెంట్‌కు, కామెడీకి గ్యాప్‌ అంటూ ఎక్కడా ఉండదు. అవి నిత్యం ప్రవహించే జీవనది లాంటివి. కృష్ణారెడ్డి ఆ నదిని నమ్ముకుని ప్రయాణం మొదలు పెట్టిన దర్శకుడు. ఆ నదిలోనే మునుగుతాడు.. తేలతాడు. మెగాఫోన్‌ పట్టినంతకాలం ఆ ప్రవాహంలోనే ప్రయాణిస్తాడు. ఈ సినిమాలో మీకు అది కనపడుతుంది.
ట్రైలర్‌లో హీరో ‘‘ఇంతకు ముందు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క’’ అన్నాడు. ఇది మీ జర్నీకి వర్తిస్తుందని అనుకోవచ్చా?
అది సినిమాలోని సన్నివేశంలో భాగంగా వచ్చింది. మీరు దాన్ని నా జర్నీకి వర్తింపజేయాలనుకుంటే సంతోషం. ఖచ్చితంగా మళ్లీ నా మార్క్‌ను ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాను. నేనే కాదు.. ప్రతి మనిషి.. ప్రతి రోజునూ నిన్నటి వరకూ ఒక లెక్క.. ఈ రోజు నుంచి మరో లెక్క అని ప్రారంభిస్తే ప్రతి రోజూ కొత్తగానే కనిపిస్తుంది.. అనిపిస్తుంది. అదే వారిని సక్సెస్‌కు దగ్గర చేస్తుంది.
ఇప్పుడున్న హైబ్రీడ్‌ జనరేషన్‌ను ఎలా మెప్పించ బోతున్నారు?
ఎలా ఏముంది.. ఆర్గానిక్‌ సెంటిమెంట్‌.. ఆర్గానిక్‌ కామెడీ.. ఆర్గానిక్‌ సంగీతం.. ఒక చిన్న ఆర్గానిక్‌ మెసేజ్‌తో మెప్పించబోతున్నాం.
మీరు ఈ కథను తెరకెక్కించాలనే కలను సాకారం చేసుకోవటానికి ఎన్ని రాత్రుళ్లు కలలు కన్నారు.. ఎన్ని పగళ్లు కష్టపడ్డారు?
కొన్ని సంవత్సరాలు పట్టింది. ఈ కాలంలో అచ్చిరెడ్డిగారు, నేను ఎన్ని నిద్రలేని రాత్రుళ్లు గడిపామో. ఎన్ని ఉత్సాహాలు పంచుకున్నామో.. ఎన్ని సార్లు పకపకా నవ్వుకున్నామో.. ఈ స్క్రిప్ట్‌ రాస్తున్నప్పుడు నాలో నేనే ఎన్నిసార్లు నవ్వుకున్నానో. నిర్మాత కల్పన గారికి చెప్పి ప్రాజెక్ట్‌ ఓకే చేయించుకున్న తర్వాత ఆమెతో కలిసి ఈ కల వెండితెర మీద ఎప్పుడు ఆవిష్కృతమౌతుందా అని ఎన్ని రోజులు ఎదురు చూసామో.. ఇవన్నీ మాకు అద్భుతమైన అనుభూతులు పంచడం వల్లే ఈ సినిమా ఇంత చక్కటి ట్రాక్‌లోకి వచ్చింది.
ఒకప్పుడు షూటింగ్‌ అంటే ఆర్టిస్ట్‌లు అందరూ సెట్‌లోనే ఉండేవారు.. ఇప్పుడు కేరవాన్‌ కల్చర్‌ నడుస్తోంది.. మీరు అప్పటి నుంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఈ విషయంలో మీరు గమనించిన తేడా ఏంటి?
ఇంతకు ముందు నేను ‘డివోర్స్‌ ఇన్విటేషన్‌’ అని ఒక హాలీవుడ్‌ సినిమా చేశాను. అప్పుడు హాలీవుడ్‌లో నేను గమనించింది.. ఒక ఆర్టిస్ట్‌ మీద క్లోజ్‌ షాట్‌ తీస్తుంటే.. మిగిలిన ఆర్టిస్ట్‌లు కూడా ఆ సమయంలో తమ పాత్రల్లో నటిస్తూనే ఉంటారు. వారిని మీద కెమెరా ఉండదు. ఆ షాట్‌తో వారికి సంబంధం ఉండదు.. కానీ ఆ సన్నివేశంతో వారికి సంబంధం ఉంటుంది. వీరు ఇలా చేయడం వల్ల ఏ పాత్రమీదైతే షాట్‌ తీస్తున్నామో.. ఆ పాత్ర పోషిస్తున్న నటులు లీనమై నటిస్తారు. ఇది మన ప్రఖ్యాత దర్శకులు కె.వి. రెడ్డి గారి సిద్ధాంతం. ఆ పద్ధతి మళ్లీ మనకు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు సినిమా లెవల్‌ నెక్ట్స్‌ లెవల్‌కు వెళుతుంది.
ఇప్పటి వరకూ కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వానికి పరిమితమైన మీరు మాటలు ఎందుకు రాయాల్సి వచ్చింది?
అందుకు ప్రధాన కారణం మా అచ్చిరెడ్డి గారే. ఈ కథను డెవలప్‌ చేస్తున్న టైంలో అచ్చిరెడ్డి గారితో ఈ పాత్ర ఇలా అంటుంది.. ఆ పాత్ర అలా అంటుంది అని నేను కొన్ని డైలాగ్‌లు ఊహించుకుని చెపుతుంటే.. అచ్చిరెడ్డి డైలాగ్స్‌ చాలా బాగున్నాయి.. నువ్వు ఈ సినిమాకు మాటలు ఎందుకు రాయకూడదు అంటూ నన్ను మాటల రచయితను చేసేశారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత పదునైన మాటలు వెతికి వెతికి రాయాల్సి వచ్చింది.
పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు.. నా నిర్మాతలందు నిర్మాత కల్పన వేరయా అన్నారు.. ఎందుకని?
అది వందశాతం నిజమండి. ఒక నిర్మాతకు తన సినిమా మీద ప్యాషన్‌ లేకపోతే.. ఎంత గొప్ప దర్శకుణ్ణి పెట్టినా అది ఉప్పులేని పప్పులాగే ఉంటుంది. ఏ ప్రాజెక్ట్‌లో నిర్మాత పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అవుతారో.. అది ఒక అద్భుతమైన వేలోకి వెళుతుంది. ఇప్పటికి వరకూ నేను పనిచేసిన నిర్మాతలను తక్కువ చేయడం అని కాదు గానీ.. నా గత చిత్రాల నిర్మాతలు నేను ఏ ఆర్టిస్ట్‌ను అడిగి వారిని, ఏ టెక్నీషియన్‌ను అడిగితే వారిని అప్పగించారు. కానీ కల్పన గారు నేను అడిగిన వారికన్నా మరో మెట్టు పైనున్న వారినే తీసుకొచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. ఇలాంటి ప్యాషన్‌ ఉన్న నిర్మాతలు ఉంటే ఇండస్ట్రీ ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది.

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *