బలగం సినిమా కథ 90 శాతం నాదే.. జర్నలిస్టు సతీష్ ఆరోపణలు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థల్లో భాగమైన దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం బలగం.. తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి , జయరాం తదితర తారాగణంతో ఈ సినిమా మార్చి 3వ తేదీన రిలీజైంది. సినీ విమర్శకులతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన ప్రముఖ జర్నలిస్టు గడ్డం సతీష్..బలగం సినిమా కథ నాదేనని దిల్ రాజ్ ప్రొడక్షన్ హౌస్, దర్శకుడు వేణుపై ఆరోపణలు చేయడం వివాదాస్పదంగా మారింది. శనివారం ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో సతీష్ మాట్లాడుతూ..
ప్రముఖ తెలంగాణ దినపత్రిక నమస్తే తెలంగాణలో నేను పనిచేస్తున్నాను. ఈ కథను నేను 2011లో రాసిన పచ్చి కి కథను 2014లో డిసెంబర్ 24వ తేదీన నమస్తే తెలంగాణలో ఆదివారం మ్యాగజైన్ బతుకమ్మలో అచ్చు వేశారు. నా కథలో కాస్త మార్పులు చేర్పులు చేసి దిల్ రాజు ఈ కథను కమర్షియల్ సినిమాగా తీసి డబ్బులను ఆయన జేబులో వేసుకుంటున్నాడు. పైగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు అని సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు.
పచ్చికి అంటే పక్షికి అని అర్థం. సాధారణంగా మనుషులు చనిపోతే పక్షులకు ఆహారం పెడతారు. మనిషి చనిపోయిన తర్వాత మూడు , ఐదు, ఏడవ రోజుల్లో పక్షికి ముద్ద పెడతారు. పక్షికి పెట్టేదాన్ని పచ్చికి అనే కథగా రాశాను. బలగం అనే పదం కూడా కరెక్ట్ కాదు. బల్గం అనేది సరియైన పదం అని సతీష్ తెలిపారు. ఈ సినిమా కథ నాదేనని అందుకు నిదర్శనమే పచ్చికి కథ అని.. నాకు రావలసిన గుర్తింపు నాకు ఇవ్వాలి. సినిమా టైటిల్స్‌లో మూల కథ నాదేనని క్రెడిట్ ఇవ్వాలి అని గడ్డం సతీష్ తెలిపారు.
కొన్ని సినిమాలలో వాళ్లు రాసిన కొన్ని కొన్ని పదాలను, పాటలుగా వాడుకుంటేనే ఈ రోజుల్లో ఎంతోమంది ఎన్నో గొడవలు చేస్తున్నారు. అలాంటిది నేను రాసిన పచ్చికి కథను 90 శాతం తీసుకొని సినిమాగా మార్చారు. బలగం సినిమా కధ క్రెడిట్ మొత్తం నాకే దక్కాలని.. ఈ విషయాన్ని వారే అధికారికంగా అనౌన్స్ చేస్తే చాలా సంతోషమని.. లేకపోతే నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. కోర్టును ఆశ్రయించేందుకు న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నాను. ఒక జర్నలిస్టుకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏమిటి అని జర్నలిస్ట్ గడ్డం సతీష్ ప్రశ్నించారు.