ఘనంగా తెలుగు సినీ కార్మిక దినోత్సవం
తెలుగు సినీ కార్మిక దినోత్సవ కార్యక్రమం హైదరాబాద్ల లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్ డీసీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం, ఫిలించాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, దర్శకులు కాశీ విశ్వనాథ్, ఎన్ శంకర్, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, తుమ్మలపల్లిరామసత్య నారాయణ తదితరులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశం ద్వారా సినీ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి పనిచేసిన ఇరవై నాలుగు విభాగాల వారికి సన్మానం చేశారు. పాటల రచయిత చంద్రబోస్, సినిమాటోగ్రాఫర్ కె కె సెంథిల్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ సాబూ సిరిస్, స్టంట్ మాస్టర్ కింగ్ సొలమన్ లకు సన్మానం జరిపారు. ఫిలిం ఫెడరేషన్ కు ఇటీవల ఎన్నికైన అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రటరీ పీఎస్ఎన్ దొర, కోశాధికారి వి సురేష్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల సినీ కార్మికులకు పెంచిన వేతనాల అగ్రిమెంట్లను ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వారికి ఫిలిం చాంబర్ అందజేసింది. ఇండస్ట్రీలోని 25 వేల మంది సినీ కార్మికుల సంక్షేమానికి ఎల్లవేళలా పాటుపడతామని, తమకు సహకారం అందిస్తున్న సినీ పరిశ్రమ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని. ఎఫ్ డీసీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ సినీ పరిశ్రమకు ప్రభుత్వం నిత్యం అండగా నిలబడుతున్నది, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎఫ్ డీసీ కార్యాలయం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, సినీ కార్మికులు అవసరం ఉన్నప్పుడు తప్పక తన దగ్గరక రావొచ్చని అన్నారు.