అలీ చేతుల మీదుగా ‘నవ్వుల మాంత్రికుడు రమణారెడ్డి’ పుస్తకం ఫస్ట్‌లుక్ లాంచ్
పాత తరానికి చెందిన హాస్య నటుడు రమణారెడ్డి గొప్ప కమెడియన్ అని ప్రముఖ సినీ నటుడు అలీ ప్రశంసలు కురిపించారు. ‘నవ్వుల మాంత్రికుడు రమణారెడ్డి’ పుస్తకం ఫస్ట్ లుక్ ను అలీ తన నివాసంలో బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. “రమణారెడ్డి లెజెండ్రీ కమెడియన్. ఆయన ఏ పాత్ర చేసిన నెల్లూరు యాసను వదల్లేదు. ఆయన తెరమీద కనిపిస్తే చాలు చప్పట్లు కొట్టేవారు. రేలంగి, అల్లు రామలింగయ్య, రాజబాబు వీళ్లంతా గొప్ప కమెడియన్లు. వీళ్లందరిదీ ఒక స్వర్ణ యుగం. వీళ్ళ గురించి ఈ సందర్భంగా మాట్లాడటం నా అదృష్టం అన్నారు. రమణారెడ్డి గురించి చెప్పాలంటే ఆయనది ఒక స్టైలు. మాయాబజార్ లో అం అః కమ్ కహాలను కూడా మంత్రాలుగా మార్చిన ఘనత ఆయనది. ఆయన టైమింగ్ గొప్పది. మాయాబజార్, గుండమ్మ కథ లాంటి గొప్ప సినిమాలు చూసి ఎదిగాము. ఆయన పుస్తకం ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా”నని చెప్పారు. “సీనియర్ జర్నలిస్టు ఫయాజ్ ఈ పుస్తకాన్ని రాశారు. ఆయనకు నా అభినందనలు. అలాగే ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్న పబ్లిషర్ జీలాన్ బాషాకు కూడా నా అభినందనలని, నెల్లూరు ప్రజలకు కూడా నా నమస్కారం” అని అలీ తెలిపారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు ఫయాజ్ మాట్లాడుతూ… “గొప్ప నటుడైన రమణారెడ్డి లెజెండ్రీ కమెడియన్. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. నెల్లూరుకు చెందిన రమణారెడ్డి గారి గురించి పుస్తకం రాసే అదృష్టం నాకు కలిగింది. ఒక లెజెండ్రీ కమెడియన్ గురించి మరో గొప్ప కమెడియన్ అలీ గారు ఫస్ట్ లుక్ ఆవిష్కరించడం చాలా సంతోషం. ఇటువంటి అవకాశం ఇచ్చిన జీలాన్ బాషాకు ధన్యవాదాలు”అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్, పబ్లిషర్ జీలాన్ బాషా పాల్గొని ఈ కార్యక్రమం చక్కగా జరగడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, అందుకు తన ధన్యవాదాలని తెలిపారు.