మమ్ముట్టి ‘భ్రమయుగం’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్
లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రంగా బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించబడిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘భ్రమయుగం’ తెలుగులో ప్రతిష్టాత్మక సితార ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఫిబ్రవరి 23న విడుదల కానుంది.
కొందరు నటులు తమ నటనా నైపుణ్యంతో భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంటారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అటువంటి లెజెండరీ నటుడే. ఆయన నటించిన సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. మమ్ముట్టి తాజా చిత్రం ‘భ్రమయుగం’ కూడా అలాగే అందరి దృష్టిని ఆకర్షించింది.
నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ పతాకాలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమా యొక్క వైవిధ్యమైన కథాంశానికి, ఇందులోని మమ్ముట్టి అద్భుతమైన నటనను ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు కురిశాయి.
మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ వంటి నటీనటులు కూడా అద్భుతంగా నటించి మెప్పించిన ఈ చిత్రం.. ప్రేక్షకులకు వెండితెరపై ఓ కొత్త అనుభూతిని అందిస్తోంది.
రచయిత-దర్శకుడు రాహుల్ సదాశివన్, సినిమాటోగ్రాఫర్ షెహనాద్ జలాల్, ఆర్ట్ డైరెక్టర్ జోతిష్ శంకర్, సంగీత దర్శకుడు క్రిస్టో జేవియర్, ఎడిటర్ షఫీక్ మహమ్మద్ అలీ, సౌండ్ డిజైనర్ జయదేవన్ చక్కాడత్, ఫైనల్ మిక్స్ ఇంజనీర్ ఎం.ఆర్. రాజాకృష్ణన్.. ఇలా చిత్ర బృందమంతా మనసుపెట్టి పనిచేసి, సమిష్టి కృషితో అద్భుతమైన అవుట్ పుట్ ని అందించారు.
మలయాళం భాషలో ఇప్పటికే ‘భ్రమయుగం’ చిత్రాన్ని వీక్షించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు.. ఇది ప్రతి సినీ ప్రియుడు తప్పక చూసి అనుభూతి చెందాల్సిన సినిమా అని చెబుతున్నారు.
విభిన్నమైన, ఆసక్తికరమైన చిత్రాలను నిర్మిస్తున్న సూర్యదేవర నాగ వంశీ నేతృత్వంలోని సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ అద్భుతమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ‘లియో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని విడుదల చేసిన సితార సంస్థ.. ఇప్పుడు ‘భ్రమయుగం’ తెలుగు వెర్షన్ ను ఫిబ్రవరి 23న విడుదల చేస్తోంది.
రచన, దర్శకత్వం: రాహుల్ సదాశివన్
నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్
మాటల రచయిత: టి.డి. రామకృష్ణన్
సంగీతం: క్రిస్టో జేవియర్
కెమెరా: షెహనాద్ జలాల్,
కళ: జోతిష్ శంకర్,
కూర్పు: షఫీక్ మహమ్మద్ అలీ
మేకప్: రోనెక్స్ జేవియర్
కాస్ట్యూమ్స్: మెల్వీ జె
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్