దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరగనున్న టిఎఫ్‌సిసి సౌత్ ఇండియా నంది అవార్డులు
తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో దుబాయ్‌లో అంగరంగ వైభవంగా టిఎఫ్‌సిసి సౌత్ ఇండియా నంది అవార్డులు జరగనున్నాయి. ఈ సందర్భంగా దుబాయ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో టిఎఫ్‌సిసి నంది అవార్డులకు సంబంధించిన బ్రౌచర్‌ను ప్రముఖ నటుడు హీరో సుమన్ చేతులు మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హీరో సుమన్ గారు మాట్లాడుతూ.. దుబాయ్ ఎంతో అభివృద్ధి చెందిన దేశం, ఇక్కడ వ్యాపారం మాత్రమే కాకుండా కళలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటి వరకు దుబాయ్‌లో ఉత్తరాదికి చెందిన సినిమా అవార్డుల వేడుకలు జరిగాయి, ఈసారి టిఎఫ్‌సిసి సౌతిండియా నంది అవార్డులను దుబాయ్‌లో నిర్వహిస్తున్నందుకు ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్ గారిని అభినందిస్తున్నాను. ప్రత కళాకారుడు, టెక్నీషియన్‌కి గుర్తింపు ఎంతో అవసరం, ప్రతిభను గుర్తించి వారికి నంది అవార్డులను ఇచ్చి వారిలో మరింత చైతన్యం, ఉత్తేజం కలిగించడం మంచి విషయం. ఈ అవార్డుల కార్యక్రమానికి అందరూ హాజరై తెలుగు సినిమా వైభవాన్ని మరింత తేజోవంతం చేయాలని కోరుతున్నాను అన్నారు.
అనంతరం తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ లయన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. గత ఏడాదే నిర్వహించాల్సిన టిఎఫ్‌సిసి నంది అవార్డులు తెలంగాణ ఎన్నికల కారణంగా వాయిదాపడ్డాయి. కానీ ఈ సంవత్సరం దుబాయ్‌లో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. కళాకారులకు ఓ ప్రత్యేక గుర్తింపునిచ్చే టిఎఫ్‌సిసి నంది అవార్డుల కార్యక్రమానికి సుమన్ గారు సహకరించడం ఆయన మంచి మంచి మనసుకు తార్కాణం. ఇక ఈ టిఎఫ్‌సిసి సౌత్ ఇండియా నంది అవార్డులను కేవలం తెలుగు కళాకారులకే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ సినీ రంగాల వారికి కూడా ప్రధానం చేయబోతున్నాం. సినీ రంగంలోని నటీ నటులతో పాటు 24 క్రాఫ్ట్స్‌కి చెందిన ప్రతిభ గల వారికి ఈ అవార్డులను అందించనున్నాం. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మాతో పాటు మీరు కూడా దుబాయ్‌కి విచ్చేసి టిఎఫ్‌సిసి సౌతిండియా నంది అవార్డుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం అన్నారు.
దుబాయ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టి హోమ్స్ సీఎండీ వైకుంఠరావు, దుబాయ్ ప్రిన్స్ మేనేజర్ బిను చార్లీ, సీఏ రవికుమార్ సింగిరి తదితరులు పాల్గొన్నారు.