ఆకట్టుకున్న ప్రముఖ చిత్రకారుడు విజయ్ కుమార్ ఆర్ట్ షో
ప్రముఖ చిత్రకారుడు యు.విజయ్ కుమార్ హైదరాబాద్ మాదాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన ఆర్ట్ షో ఆహుతులను ఆకట్టుకుంది. ఈ ఆర్ట్ షో నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఆర్ట్ షోను నిర్వహిస్తున్నారు. ఇవాళ జరిగిన విజయ్ కుమార్ ఆర్ట్ షో ప్రారంభోత్సంలో ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.ఎ. లక్ష్మి, ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ ఎ. నాగేందర్ అతిథులుగా పాల్గొన్నారు. చిత్రకారుడిగా విజయ్ కుమార్ కొనసాగిస్తున్న సుదీర్ఘ ప్రస్థానాన్ని అతిథులు కొనియాడారు. ఈ ఆర్ట్ షోను కళారంగంపై అభిరుచి గల ప్రతి ఒక్కరూ సందర్శించాలని వారు కోరారు. మొదటి రోజు ఆర్ట్ షోలో పెద్ద సంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు.
1975 తెలుగు ప్రపంచ మహాసభల నుండి ప్రారంభమైన విజయ్ కుమార్ చిత్ర కళా ప్రస్థానం దేశవ్యాప్తంగా గుర్తింపు అందుకుంది. హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై, కోల్ కతా, పూణె, వడోదర వంటి పలు నగరాల్లో ఆర్ట్ షోలు నిర్వహించి పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక పురస్కారాలు పొందారు విజయ్ కుమార్.