ఇకపై వరుస చిత్రాలు చేస్తాను : బర్త్‌డే స్పెషల్ ఇంటర్వ్యూలో ప్రతాని రామకృష్ణగౌడ్
ప్రతాని రామకృష్ణగౌడ్… నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర పరిశ్రమకు సంబంధించి ముఖ్యంగా చిన్న నిర్మాతలపాలిట వరంగా మారిన వ్యక్తి. 1992లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన 36 సినిమాలను నిర్మించి, 7చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవలకాలంలో దర్శకత్వాన్ని పక్కనపెట్టి, పూర్తిగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యకలాపాల్లో మునిగిపోయిన ఆయన మరల మెగాఫోన్ పట్టి ‘దీక్ష’ పేరుతో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం (మే 18) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ వివరాలు పాఠకుల కోసం..
పరిశ్రమకు రావాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు?
నాకు చదువుకునే రోజుల నుంచే నటన అంటే పిచ్చి. మా కాలేజీలో ‘లంబాడోళ్ల రాందాస్’ అనే నాటకం వేశాము. అది నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచే మిత్రులు నేను నటుణ్ణి కావాలని ప్రోత్సహిస్తూ వచ్చారు. దాంతో నాకు కూడా చిత్రపరిశ్రమలో నిలబడాలనే కోరిక కలిగింది. దాంతో 1992లో పరిశ్రమలోకి అడుగుపెట్టాను.
చాలాకాలం తర్వాత మెగాఫోన్ పట్టినట్టున్నారు?
మూడు దశాబ్దాలకు పైగా దర్శక, నిర్మాతగా ఇటీవల కాలంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఊపిరి సలపని బాధ్యతల వల్ల దర్శకత్వానికి కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. ఆ గ్యాప్‌కు బ్రేక్ ఇస్తూ.. కొద్ది రోజుల క్రితమే ‘దీక్ష’ అనే సినిమాను ప్రారంభించాను. మంచి సబ్జెక్ట్. అలాగే ఈ సినిమా తర్వాత ‘లేడీ కబడ్డీ జట్టు’ సినిమా చేయబోతున్నాను. దీన్ని 18 లాంగ్వేజ్‌ల్లో చేయాలని, భారీ ప్లాన్ వేస్తున్నాం. దీనికి సంబంధించిన సాంగ్స్ రికార్డింగ్ కూడా పూర్తయ్యింది. మంగ్లీ 2 పాటలు, మధుప్రియ 1 పాట పాడారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
దర్శక, నిర్మాత ` తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఈ రెండిరలో మీకు ఇష్టమైనది?
దర్శక, నిర్మాత అన్న ట్యాగ్ నా పేరు ముందు ఉండటమే నాకు ఇష్టం. అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు అన్నది అత్యున్నత గౌరవం.
తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ను ఎందుకు స్థాపించారు? ఆ లక్ష్యం నెరవేరిందా?
తెలంగాణకు సంబంధించిన కళాకారులు, నిర్మాతలు, దర్శకులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో దీన్ని స్థాపించాము. అయితే ప్రాంతాలతో సంబంధం లేకుండా ఇప్పటికి దాదాపు 16 వేలకు పైగా కళాకారులు, టెక్నీషియన్స్ మా సంస్థలో సభ్యులుగా చేరారు. ఇది చాలా గర్వంగా అనిపిస్తుంది. మా సంస్థ ద్వారా అనేక మందికి సినిమాల పట్ల, నిర్మాణం పట్ల అవగాహన కల్పిస్తూ వారికి మార్గనిర్దేశం చేస్తున్నాం. అది మంచి ఫలితాలు ఇస్తోంది.
గతంలో థియేటర్స్ సమస్యపై ఆమరణ దీక్ష చేశారు కదా.. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్స్ తాత్కాలికంగా మూసేస్తాం అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం?
అసలు సమస్య అంతా థియేటర్స్ లీజ్ విధానం వచ్చినప్పుడే మొదలైంది. అదే పర్సంటేజ్ విధానం ఉంటే అన్ని సినిమాలకు థియేటర్స్ దొరికేవి. థియేటర్స్ ఫీడిరగ్ కూడా బాగుండేది. ఎప్పుడైతే లీజ్ విధానం వచ్చిందో.. ఆ లీజ్ ఎవరి చేతిలో ఉంటే వారికి సంబంధించిన సినిమాలు వారే వేసుకుంటున్నారు. మిగిలిన థియేటర్స్‌కు ఇవ్వడం లేదు. ఇక్కడే సమస్య మొదలవుతోంది. దీనికి పరిష్కారం చూపుతూ… చిన్న సినిమాలను బతికించుకోవాలనే ఉద్దేశంతో రోజుకు ఒక షో చిన్న సినిమాలకు ఇవ్వాలని గత ప్రభుత్వంతో చర్చలు జరిపి ఒప్పించాము. కానీ దాన్ని కొందరు అడ్డుకుని అమలు కాకుండా చేశారు.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరపున నంది అవార్డులు ఇస్తున్నట్టున్నారు?
అవును. సినీ కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ఛాంబర్ తరపున నంది అవార్డులను ఇవ్వబోతున్నాం. ఆగస్ట్ నెలలో దుబాబ్‌లో ఈ ఈవెంట్‌ను ఘనంగా జరపటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈ నంది అవార్డులను ఇస్తాం.
దర్శక, నిర్మాతగా మీకు మంచి అనుభూతిని ఇచ్చిన విషయం?
నేను నిర్మించిన, దర్శకత్వం వహించిన ప్రతి సినిమా నాకు మంచి అనుభూతిని ఇచ్చాయి. అయితే సూపర్ కృష్ణగారితో ‘సర్దార్ సర్వాయి పాపన్న’ చిత్రానికి దర్శకత్వం వహించటం ఎప్పటికీ మర్చిపోలేని స్వీట్ మెమరీ.
ఈ నూతన పుట్టినరోజు సందర్భంగా ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నారా?
కొత్త నిర్ణయం అని కాదుగానీ.. ఇక నుంచి పూర్తి స్థాయిలో నిర్మాణం, దర్శకత్వంపై దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యాను. అందుకే రాబోయే రోజుల్లో బిజీ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నా. ప్రస్తుతం నేను దర్శకత్వం వహిస్తున్న ‘దీక్ష’ ఒక షెడ్యూల్ పూర్తి చేశాము. వచ్చేవారంలో మరో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ‘లేడీ కబడ్డీ జట్టు’.. ఇలా వరుసగా సినిమాలు చేస్తాను.
అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే టు యు?
థ్యాంక్యూ…