అరవింద్‌ కృష్ణను వరించిన ‘వీగన్‌ వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ పురస్కారం!

‘ఎ మాస్టర్‌పీస్‌: రెయిజ్‌ ఆఫ్‌ సూపర్‌హీరో’ హీరో అరవింద్‌ కృష్ణను ‘వీగన్‌ వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ పురస్కారం వరించింది. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ ‘శుక్ర’, ‘సిట్‌’ ప్రాజెక్టులతో తనకంటూ అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నటుడు అరవింద్‌ కృష్ణ. ఆయన రీసెంట్‌ వెంచర్‌ ‘సిట్‌’ గత ఎనిమిది వారాలుగా ట్రెండింగ్‌లో ఉంది. విజయవంతమైన ప్రాజెక్టులతోనే కాదు, వీగన్‌ లైఫ్‌స్టైల్‌తోనూ నిత్యం వార్తల్లో ఉంటారు హీరో అరవింద్‌ కృష్ణ. గత కొన్నేళ్లుగా ఆయన అనుసరిస్తున్న వీగన్‌ లైఫ్‌స్టైల్‌కి అరుదైన గుర్తింపు దక్కింది. ‘వీగన్‌ వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ పురస్కారాన్ని అందుకున్నారు అరవింద్‌ కృష్ణ.

గత రెండేళ్లుగా ఆయన వీగనరీ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన వీగన్‌ ఇండియా కాన్ఫెరెన్స్ లోనూ పార్టిసిపేట్‌ చేశారు. అరవింద్‌ కృష్ణతో పాటు బాలీవుడ్‌ నటి జాక్వలిన్‌ ఫెర్ఫాండెస్‌ కూడా ఆ కాన్‌క్లేవ్‌లో ప్యానలిస్టుగా వ్యవహరించారు. ఈ క్రమంలో వీగన్‌ జీవన శైలికి సంబంధించి ఇద్దరూ తమ ఆలోచనలను కలబోసుకున్నారు. అరవింద్‌ కృష్ణను ‘వీగన్‌ వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ పురస్కారంతో సత్కరించారు. ఆరోగ్యవంతమైన, దయతో కూడిన దినచర్య గురించి అవగాహన కల్పిస్తున్నందుకు ఆయన్ని సభికులు అభినందించారు. ‘వీగనిజమ్‌ నేను నమ్మే సిద్ధాంతం’ అని అన్నారు అరవింద్‌ కృష్ణ. ఆయన మాట్లడుతూ ”ఈ పురస్కారాన్ని బాధ్యతతో స్వీకరిస్తున్నాను. నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఇష్టంగా, మరింత సమర్థవంతంగా ఆచరించడానికి, నలుగురికీ పంచడానికి ఈ పురస్కారం నాలో బలమైన స్ఫూర్తి పంచుతోంది” అని అన్నారు.
నటుడిగా కెరీర్‌ని కొనసాగిస్తున్న హీరోల్లో ఏకైక బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌గానూ అరుదైన గుర్తింపు ఉంది అరవింద్‌కృష్ణకు. యాక్టర్‌గా, అథ్లెట్‌గా, వీగనిజాన్ని ఫాలో అవుతున్న స్టార్‌గా తనదైన ప్రత్యేకతను చాటుతున్నారు అరవింద్‌ కృష్ణ. వీగనిజమ్‌ వల్ల తాను అథ్లెట్‌గానూ, నటుడిగానూ మరింత చురుగ్గా వ్యవహరించగలుగుతున్నానన్నది అరవింద్‌ కృష్ణ చెబుతున్న మాట. ”కండరాల దృఢత్వానికి, గ్రౌండ్‌లో సమర్థవంతంగా ఆడటానికి, చురుకుగా వ్యవహరించడానికి నా వీగన్‌ జీవన శైలి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రకృతి కోసం, నేను నమ్మే నైతికత కోసం వీగన్‌గా కొనసాగుతాను” అని చెప్పారు అరవింద్‌ కృష్ణ.
వీగన్‌ జీవన విధానం వల్ల తన శరీరంలో ఇంతకు మునుపటికన్నా మెరుపు కనిపిస్తోందని అంటారు అరవింద్‌ కృష్ణ. తెరమీద మరింత తేజస్సుతో కనిపించడానికి ఇది ఉపయోగపడుతుందన్నది ఆయన నమ్మే విషయం. ”వీగనిజం నాకు అన్ని విధాలా ఉపయోగపడుతోంది. నా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతున్నాయి. గతంతో పోలిస్తే నేను శ్వాసించే విధానంలోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మంచి ఆలోచనలు చేయగలుగుతున్నాను. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించగలుగుతున్నాను. దీని వల్ల కథలను ఎంపిక చేసుకోవడం కూడా సులువవుతోంది” అని అన్నారు. అరవింద్‌ కృష్ణ ప్రస్తుతం ‘ఎ మాస్టర్‌పీస్‌: రెయిజ్‌ ఆఫ్‌ సూపర్‌హీరో’ ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నారు.

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *