“నీడ” మూవీ గురించి నాకు తెలిసిన సుధీర్ఘ వీశ్లేషణ!!!

నీడ….. పెద్దలు చేసిన ఏ పనైనా పిల్లపై నీడ పడుతుంది. పిల్లలకు ఇలాంటివి అని తెలియకూడదని పెద్దలు అనుకుంటారు. అది కేవలం భ్రమ … అంతే! ఖచ్చితంగా పెద్దల కార్యకలాపాల నీడ పిల్లలపై పడుతుంది. అందువల్ల పెద్దలే పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని కనంగానే సరిపోదు. జాగ్రత్తగా వారి గూర్చి తెలుసుకుంటూ పెంచాలి. పిల్లల ఆలోచనాధోరణిలో ఏమైనా మార్పులు వస్తున్నాయా? అని డేగ చూపుతో చూస్తుండాలి….. అనే ఓ మంచి విషయాన్ని తీసుకుని అద్భుతంగా చిత్రీకరించిన చిత్రమిది. ఇప్పటి వరకు వచ్చిన వేల తెలగు చిత్రాలలో దాదాపు తొంభై శాతం చిత్రాలు నే చూసి ఉంటాను. అలా చాలా చిత్రాల్లో లేని ఓ తాజాదనం ఈ సినిమాలో ఉంటుంది.
పిల్లలు సంఘ వ్యతిరేక శక్తులుగా ఎలా తయారవుతారు అంటే.. వారి కుటుంబ మూలాలు ఓ పద్దతిలో లేవు అని సింబాలిక్ గా దాసరి చెప్పే ప్రయత్నమిది.
నే సినీ రిపోర్టర్ గా పనిచేసేప్పుడు.. ఓ సారి దాసరి గారిని ఇంటర్వ్యూ చేస్తూ … మళ్ళీ ఓసారి నీడ చిత్రాన్ని చూడాలని ఉందని అడిగాను. ఎందుకు ఈ చిత్రం ఎక్కడా దొరకడం లేదని అడిగాను. అందుకు ఆయన ఆ మూవీ రైట్స్ నిర్మాత వద్దే ఉన్నాయని… తాను కూడా ఓసారి ఆ మూవీ చూడాలనుకుంటున్నాని అన్నారు. అలా నీడ అందరికీ దూరమైనట్టుంది.
సరే….. విషయం లోకి వెళ్ళితే నేను ఈచిత్రాన్ని చాలా ఇష్టంగా చూసా! క్లాసికల్ చిత్రాల హావాలోనే వచ్చిందనుకుంటా! మూవీ విడుదల అయ్యాకు , మంచి పేరు వచ్చింది. అందుకనే ప్రతి సీనును ఎంజాయ్ చేస్తూ చూసా!
కథలోకి వెళితే…. టీనేజ్ ఉన్న ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిల కథ ఇది. ఆ పిల్లల తల్లిదండ్రులు, వారి పరిస్థితులు కూడా ప్రధానమే!
ఓ అమ్మాయి వితంతువు. సహజంగా టీనేజ్ లో వచ్చే ఆలోచనలతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. చుట్టూ ఉన్న లోకం ఆ అమ్మయి పై ఓ కన్ను వేసి ఉంటుంది. ఎక్కడైనా తప్పు చేస్తుందా? ఎవరితో మాట్లాడుతుంది? అవకాశం వస్తే తమ ఒళ్లోకి వచ్చి వాలుతుందా? ఇలా చుట్టూ ఉన్న కళ్లు చూస్తూ ఉంటాయి. ఈ కళ్ల దాటి బ్రతకాలి అని పోరాటం చేస్తుంటుందామె!
మరోకామె ఇళ్లలో పాచి పని చేసుకునే పిల్ల! వయసులో ఉన్న పిల్ల ఇళ్లలో పనికి వస్తే…. ఒక్కరి చూపులు ఒక్కోలా ఉంటాయి. ఆమె జీవన నేపథ్యంలో ఎలా సమస్యలు ఎదుర్కొంటోంది అనేది మరో ప్రశ్న!
ఇద్దరబ్బాయిల్లొ ఒకరు రమేష్ బాబు, మరొకరు ఆర్. నారాయణ మూర్తి. ఇద్దరూ టీనేజర్లే! ఇద్దరూ మంచి స్నేహితులు. రమేష్ తండ్రి ఓ ఫోటో స్టూడియో నడుపుతున్నాడు. ఫోటోలు తీయించుకోవడానికి వచ్చే ఆడవాళ్లతో సరసాలు ఆడే రకం! ఇష్టమైన వాళ్లు అతనితో సై అంటే ఏమైనా చేస్తాడు. ఇదంతా కొడుకు రమేష్ స్టుడియోకు వచ్చినప్పుడు గమినిస్తుంటాడు. తండ్రి చేసే చేష్టలు తనకూ చేయాలనిపిస్తుంటుంది. కాని తండ్రి భయం ఉంది. అలా నునూగు మీసాల వయసుతో , కోరికలతో పోరాటం చేస్తున్నాడు. రమేష్ తల్లి, పిల్లల పట్ల చాలా జాగ్రత్త గలది.
మరో పాత్ర నారాయణ మూర్తిది. తండ్రి లేడు. తల్లి కష్టం మీద బ్రతుకుతూ రమేష్ తో కలసి చదువుకుంటూ ఉంటాడు. తల్లి చేసే కష్టం ఏమిటో కొడుక్కు తెలీదు. ఏదో ఫ్యాక్టరీలో నైట్ డ్యూటీ చేస్తుందామె. వితంతువుకు రమేష్ అంటే ఇష్టం! రమేష్ కు అసలు తండ్రి చేస్తున్న పనేంటో తెలుసుకుని తానూ చేయాలని ఇష్టం! ఇంట్లో పనమ్మాయికి జీవితంలో ఏదో విధంగా సెటిల్ కావాలని ఇష్టం! కష్టపడి చదివి పెద్ద ఉద్యోగం చేసి తల్లిని సుఖపెట్టాలని నారాయణ మూర్తి కోరిక.
ఇలా నలుగురి జీవితాలలో తల్లిదండ్రుల క్రీనీడలు పడి, పిల్లల జీవితాలు ఎలా అధోగతి పాలయ్యాయో….. చెప్పిందే అసలు చిత్రీకరణ!
వితంతువు చుట్టు సమాజం చూసే చూపులు తట్టుకోలేక ఎవరో ఒకరి తీసుకుని లేచి పోతుంది. అలా ఆమె చేయడానికి సమాజం, పెద్దలే అని చిత్రకథలో చూపిస్తాడు దర్శకుడు. అంటే చక్కగా పెళ్లి చేసుకుని ఓ ఇంటికి గృహలక్ష్మి కావలసిన అమ్మాయి…..కాలే కాలే పెనుముపై పడిన నీరులా సమాజంలో అదృశ్యమైపోయింది.

పనమ్మాయి హీరో ఇంట్లోనే పని చేసి, వాళ్లింట్లోనే ఉంటుంది. ఆమె గది వేరే! స్టూడియోల్లో తండ్రి చేసే పనులు చూసిన రమేష్ ఓ రాత్రి ఆమె గదిలోకి వెళ్లి ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తాడు. కాని పరిపక్వం కాని వయసు, మనసుతో…. నిశ్శబ్దంగా తిరిగి వచ్చి తన గదిలో నిద్ర పోతాడు. అది రమేష్ తల్లి గమనిస్తుంది. ఉదయాన్నే ఆ అమ్మాయిని పని మానేసి వెళ్లిపోమ్మని చెబుతుంది. అదేంటమ్మ గారు…. అంటే…… ఆమె డైలాగ్ చెబుతుంది. ….” ఎందుకంటే నువ్వు వయసులో ఉన్నావు. నా పిల్లలూ వయసులో ఉన్నారు” అని!
ఆ తల్లి బిడ్డ ఎక్కడ చెడిపోతాడో అని రెండు కళ్లుతో గమనించేదే కానీ, భర్తపై ఏ నిఘా పెట్టలేదు. ఇక్కడ తల్లిగా ఆమె గెలుచినా , భార్యగా ఓడిపోయింది. పనమ్మాయిని ఇంట్లోనుండి వెళ్లగొట్టే సరికే , ఆమె భర్త పనమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉన్నాడు. అనుకోకుండా తన భార్య ఇంట్లో నుండి వెళ్లగొట్టిన పనమ్మాయిని …… రమేష్ తండ్రి మరో ఇల్లు తీసి, తన అక్రమ సంబంధాన్ని సక్రమ సంబంధం చేసుకున్నాడు. అదీ మోజు తీరేదాక మాత్రమే ! ఆతర్వాత పనమ్మాయి…‌పోషణ లేక వేశ్యగా మారుతుంది. అంటే సమాజంలో వికృత పోకడకు మరో సమిధ వచ్చి చేరింది. ఇది ఎవరి పాపం ? అని ప్రశ్నిస్తాడు దర్శకుడు.
ఇక హీరో రమేష్… లేత యవ్వన కోరికలతో ఉన్న సమయంలో…. నారాయణ మూర్తి తల్లికి , రమేష్ కు అక్రమ సంబంధం ఏర్పడుతుంది. ఓ సారి కోరికలతో వేశ్యావాటికలలో తిగిగే రమేష్ కు , తన నేస్తం నారాయణ మూర్తి తల్లి కనిపిస్తుంది. అప్పటి నుండి స్నేహితుని తల్లితో రమేష్ తన కోరికలు , తన స్నేహితునికి తెలియకుండా వాళ్ల ఇంట్లోనే తీర్చుకుంటూన్నాడు. లేవదీసుకెళ్లిన వాడు వదిలేయడంతో… వితంతువు కూడా మళ్లీ వేశ్యావాటికలో రమేష్ కు కనిపిస్తుంది. మళ్లీ ఆమెను కూడా యవ్వన మజిలీ చేస్తాడు. అక్కడే ఎదురయిన పనమ్మాయి కూడా రమేష్ కు ఎదురవుతుంది. ఆమె కూడా తండ్రికి, కొడుక్కూ ఎటువంటి తేడా చూపదు. ఎందుకంటే ఆమె బ్రతకాలి కదా! అలా శారీరకంగా, నైతికంగా పతనమైన రమేష్ సుఖ వ్యాధుల బారిన పడతాడు. ఎవరికీ చెప్పుకోలేడు. అలాగని దాచుకుని ఇబ్బందులు పడలేడు. చివరికి చావే పరిష్కారమని ఆత్మహత్య చేసుకుంటాడు. అలా యువత వ్యసనాల బారిన పడి బంగారు జీవితాలను పిందె కాలమందే నాశనం చేసుకుంటున్నారని దర్శకుని లోచన!!
నాలుగో పాత్ర నారాయణ రావును అప్పుడప్పుడు ఈ చిత్రంలో హాస్యానికి వాడుకున్నా చివర్లో , తన తల్లి స్వరూపం తెలిసిన కొడుకు ఉగ్రమూర్తి అవుతాడు. తన ప్రియ నేస్తం రమేష్ చావుకు తన తల్లి కూడా ఓ కారణమని గ్రహిస్తాడు. నక్సల్ బరీ ఉద్యమంలోకి దూకి, ఓ తుపాకితో తన తల్లిని అంతమొందించి, అడవులలో అజ్ఞాతవాసి అవుతాడు. ఇక్కడ అతని తల్లి నీడ పడి ఓ యువకుడు, అలాంటి దారి పట్టాడు… ఈ పాపం ఎవరిది? అతని తల్లిది కదా! అని ప్రశ్న ప్రేక్షకుల మనసులో కలిగేలా సినిమా ఉంటుంది.
చిత్రంలో నాలుగు పాత్రలు కూడా పెద్దల నీడ పడి నామరూపాలు లేకుండా పోయాయి అన్న భావన కలుగుతుంది.
ప్రేక్షకుడికి కావాలసిన మషాళాలేవీ ఉండవు. ఓ నాలుగు జీవిత గమనాలను చూస్తాం … అంతే! ఆ నీడల చాటున మన జాడలు వెత్తుక్కుంటాం!
దర్శకునికి కావలసింది కూడా అదే!!

ఉపసంహారం!!
చిత్రం ప్రారంభంలో కొత్త నటీనటుల ఎంపిక కార్యక్రమం ఎలా జరుగుతుంది అన్నది కూడా జత చేసారు. నారాయణ మూర్తి దాసరి గారి ఎంతగానో బతిమాలుతాడు. ఒక్క అవకాశం ఇప్పించమని! ఆ ఎపిసోడ్ అంతా కామెడీగా ఉంటుంది. చిత్రమేమంటే….. సినిమా చివర్లో నారాయణ మూర్తి నక్సల్ తో కలవడంతో సినిమా ముగుస్తుంది. అదేం చిత్రమో ఆ తర్వాత నారాయణ మూర్తి , అన్నీ ఆ నీడ పడిన చిత్రాలే తీసారు. అంటే ఆయన తీసిన చిత్రాలన్నింటికీ మొదట పడిన “నీడ” ఈ “నీడ” అన్నమాట!
అన్నమాటేం కాదు….. ఉన్నమాటే!!

అందరికీ నమస్కారం మీ “సరయు శేఖర్”

🙏🙏🙏🙏 .

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *