ప్రతీ పౌరుడు చూడాల్సిన చిత్రం ‘శాసనసభ’
‘శాసనసభ’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించాం. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ప్రధాకార్షణగా నిలుస్తుంది. ప్రతీ పౌరుడు చూడాల్సిన సామాజిక సందేశాత్మక చిత్రమిది’ అన్నారు నిర్మాతలు తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని. సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై వారు నిర్మించిన చిత్రం ‘శాసనసభ’. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటించారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘చిన్న బడ్జెట్లో మొదలుపెట్టిన ఈ సినిమా నిర్మాతలు అందించిన ప్రోత్సాహంతో పాన్ ఇండియా మూవీగా మారింది. ‘కేజీఎఫ్’ ‘కేజీఎఫ్-2’ చిత్రాలకు సంగీతాన్నందించిన రవి బస్రూర్ వంటి సెన్సేషనల్ మ్యూజిక్ డెరెక్టర్ ఈ సినిమాకు పనిచేయడం పెద్దబలంగా నిలిచింది. హీరో ఇంద్రసేన పెద్దహీరోల తరహాలో యాక్షన్ ఘట్టాల్లో ఆకట్టుకుంటారు’ అని తెలిపారు. పవిత్రమైన శాసనసభ గౌరవాన్ని పెంచితే బాగుంటుందనే ఆలోచన నుంచే ఈ కథ పుట్టిందని, సెన్సార్ సభ్యుల అభినందనలు సినిమా విజయంపై మరింత నమ్మకాన్ని పెంచాయని చిత్ర కథ, మాటల రచయిత రాఘవేందర్‌రెడ్డి చెప్పారు. పొలిటికల్ డ్రామా, ఎమోషన్స్‌తో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని నాయకానాయికలు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రాలో ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్‌గారు విడుదల చేస్తున్నారని నిర్మాతలు తెలిపారు. ఈ చి*త్రంతో నటుడిగా తనకు మంచి గుర్తింపు లభిస్తుందనే నమ్మకం వుందని నటుడు అబీద్ భూషణ్ తెలిపారు.
—