వినోదం, సందేశం కలిపిన “సారంగదరియా” మూవీ రివ్యూ
ఇటీవల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా సారంగదరియా. టీజర్, ట్రైలర్, పాటలు బాగుండటంతో ఈ సినిమాపై అందరి ఆసక్తి నెలకొంది. రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహమద్ ,మోహిత్ పేడాడ, నీల ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన సారంగదరియా ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ
లెక్చరర్ కృష్ణ(రాజా రవీంద్ర)ది మధ్య తరగతి కుటుంబం. భార్య లక్ష్మి (నీల ప్రియ) ముగ్గురు పిల్లలు అర్జున్, సాయి, అనుపతో ఉన్నంతలో గౌరవంగా బతుకుతుంటాడు. అయితే కృష్ణ కుటుంబంలో కొడుకుల వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. పెద్ద కొడుకు అర్జున్ (మొయిన్ మొహమద్) ప్రేమ విఫలమై మద్యానికి బానిసగా మారుతాడు. సాయి ( మోహిత్ పేడాడ)కి ప్రేమ వ్యవహారాల సరదా ఉంటుంది. ఫాతిమను ప్రేమిస్తుంటాడు సాయి. కృష్ణ కూతురు అనుపమ (యశస్వినీ) క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది. అయితే ఆమెకు అందాల పోటీల్లో పాల్గొనాలనే కోరిక ఉంటుంది. అందంగా ఉండే అనుపమ వెంట ఆ కాలనీలోని కుర్రాళ్లంతా ప్రేమిస్తున్నామంటూ వెంటపడుతుంటారు. వారిలో రాజ్ అనే కుర్రాడు అనుపమను సిన్సియర్ గా ప్రేమిస్తాడు. అనుపమ గురించి తెలిసిన ఓ నిజం కృష్ణ కుటుంబం సమాజంలో అవమానాలకు గురయ్యేలా చేస్తుంది. అవమానాలు తట్టుకోలేక అనుపమ ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. అనుపమ జీవితంలోని ఆ చేదు నిజం ఏంటి, ఆమె తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందా లేదా, సాయి, ఫాతిక ప్రేమ కథ సక్సెస్ అయ్యిందా లేదా అనేది మిగిలిన కథ.
ఫ్లస్ పాయింట్స్
స్టోరీ
డైరెక్షన్
మెసేజ్, ఎంటర్ టైన్ మెంట్
రాజా రవీంద్ర, యశస్వినీ యాక్టింగ్
మైనస్ పాయింట్స్
కొన్ని ల్యాగ్ సీన్స్
విశ్లేషణ
సకుటుంబంగా ప్రేక్షకులు చూడాల్సిన సినిమా సారంగదరియా. ఈ సినిమా చూస్తే కుల, మత, జెండర్ విషయంలో మనం ఎంత విశాల హృదయంతో ఆలోచించాలో తెలుస్తుంది. అలాగే కొడుకులు తమ తండ్రి పట్ల, కుటుంబ పట్ల ఎలా బాధ్యతగా ఉండాలో నేర్పిస్తుంది. ప్రేమ విఫలమైతే జీవితం పాడు చేసుకోవద్దనే సందేశం తెలుస్తుంది. ట్రాన్స్ జెండర్స్ పట్ల ఈ సమాజం ఎలా హుందాగా వ్యవహరించాలో అర్థమవుతుంది. కృష్ణ కుటుంబాన్ని పరిచయం చేస్తూ సరదాగా మొదలయ్యే ఈ సినిమా అనుపమ జీవితంలో జరిగిన ఓ విషాధ ఘట్టంతో కీలకమైన మలుపు తిరుగుతుంది. కథలో ఎమోషన్ చాలా ఉన్నా..దాన్ని వీలైనంత తగ్గించి కథ దారి తప్పకుండా వినోదాన్ని జోడించాడు దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి. సాయి, ఫాతిమ లవ్ స్టోరీ, అందులో సాయి ఫ్రెండ్ చేసే కామెడీ నవ్విస్తుంది. అర్జున్ తాగుడు వ్యసనాన్ని కూడా చాలా సీన్స్ లో సరదా యాంగిల్ లోనే తెరకెక్కించారు దర్శకుడు. దీంతో ప్రేక్షకులకు అటు ఎమోషనల్ గా ఫీల్ కలుగుతూనే వినోదంతో రిలీఫ్ దక్కింది.
సమాజంలో ట్రాన్స్ జెండర్ కూడా భాగమేనని, వారికీ అన్ని హక్కులు ఉంటాయనే విషయాన్ని అనుపమ పాత్ర ద్వారా చెప్పిన తీరు హార్ట్ టచింగ్ గా ఉంది. కులం కారణంగా అర్జున్ తన ప్రేమకు దూరమవడం, మతం వల్ల సాయి ఫాతిమను దక్కించుకోవడం కోసం సంఘర్షణ పడటం, ట్రాన్స్ జెండర్ కావడం వల్ల అనుపమ సొసైటీ నుంచి ఎదుర్కొన్న అవమానాలు. తన ముగ్గురు పిల్లల పరిస్థితి చూసి తండ్రిగా కృష్ణ పడే వేదన ఇవన్నీ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. చివరగా అనుపమ తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం స్ఫూర్తికరంగా ఉంది. ఓ మధ్య తరగతి తండ్రిగా, లెక్చరర్ గా రాజా రవీంద్ర నటన ప్రశంసలు అందుకునేలా ఉంది. సాయిగా మోహిత్ పేడాడ, అర్జున్ పాత్రలో మొయిన్ మొహమద్ ఆకట్టుకున్నారు. అనుపమ పాత్రలో యశస్వినీ నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ట్రాన్స్ జెండర్ గా ఆమె పలికించిన ఎమోషన్స్ హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. మెయిన్ లీడ్ అంతా తమ పాత్రలకు పర్పెక్ట్ గా కుదిరారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇతర టెక్నికల్ టీమ్ పనితనం బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఆకట్టుకున్నాయి. ఈ వీక్ వినోదం, సందేశం కలిపిన సినిమా చూడాలనుకునేవారికి సారంగదరియా బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
maamovie.com Rating : 3.25/5