వాస్తవికతకు కవితాత్మక రూపం -భారతీ రాజా
భారతీయ చలనచిత్ర చరిత్రలో కొంతమంది దర్శకులు సినిమాలు తీస్తారు… మరికొంతమంది సినిమాల ద్వారా ఒక కొత్త భాషను సృష్టిస్తారు. అలాంటి అరుదైన దర్శకుల్లో ఒకరు భారతీరాజా. తమిళ సినీ పరిశ్రమలో గ్రామీణ జీవితాన్ని తెరమీదకు తెచ్చి, దానికి కొత్త సౌందర్యాన్ని అందించిన దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. స్టూడియో గోడల మధ్య జరుగుతున్న కథలను పచ్చని పొలాల్లోకి, మట్టివాసనల మధ్యకి తీసుకువచ్చిన విప్లవాత్మక దర్శకుడు భారతీరాజా. ఈరోజు మనం ఆయన దర్శకత్వ ప్రతిభను తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కొన్ని చిత్రాల ఆధారంగా విశ్లేషించుకు౦దా౦. అవి సీతాకోక చిలుక, ఎర్ర గులాబీలు , టిక్ టిక్ టిక్ , కొత్త జీవితాలు, ఆరాధన ,ఆత్మ బంధువు, మరియు వేదం పూదిదు తదితర చిత్రాలన్నింటినీ పరిశీలిస్తే, భారతీరాజా కేవలం కథలు చెప్పిన దర్శకుడు కాదని… సమాజాన్ని ప్రశ్నించిన ఆలోచనాపరుడని తెలుస్తుంది.
భారతీరాజా సినిమాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది గ్రామీణ నేపథ్యం. ఆయనకు ముందు గ్రామాలు సినిమాల్లో ఎక్కువగా అలంకార వస్తువుల్లా కనిపించేవి. కానీ భారతీరాజా చేతిలో గ్రామం ఒక జీవించే పాత్రగా మారింది. సీతాకోక చిలుక చిత్రాన్ని తీసుకుంటే, అది కేవలం ప్రేమకథ కాదు. కులాలు, మతాలు, సామాజిక గోడల మధ్య చిక్కుకున్న యువ ప్రేమకు ప్రతీక. గ్రామంలోని ప్రతి చెట్టు, ప్రతి దారి, ప్రతి ఇంటి గోడ కూడా కథలో భాగమవుతుంది. భారతీరాజా ప్రత్యేకత ఏమిటంటే, ప్రకృతిని బ్యాక్‌డ్రాప్‌గా కాకుండా కథనంలో భాగంగా ఉపయోగించడం. అలా చిత్రమంతా సముద్ర తీరం , టేకు చెట్ల తోటల్లో , అందమైన మంచినీటి సరసుల్లో జరుగుతుంది. గ్రామీణ జీవితానికి నిర్వచనంగా ప్రతి సన్నివేశ౦ ఉంటుంది. సినిమాలో పాత్రల మనోభావాలు మారినప్పుడు ప్రకృతి రంగులు కూడా మారుతాయి. ‘సాగర సంగమమే ప్రణయ’ పాటలో బాలు అధ్భుతమైన గాత్రానికి ఎలివేషన్ లా పెద్ద కొండపై హీరో పరిగెత్తే సిన్ ను కొండ కింద కెమెరా పెట్టి ఓ దృశ్యాన్ని ఒడిసి పట్టిన తీరు, ఒక కవి చూపు కలిగిన దర్శకుడికే సాధ్యం.
ఈ చిత్రం మొదట తమిళ్ లో తీసారు. ‘అలైగళ్ ఓవదిలై’ అంటే అలలకు అడ్డు లేదు అని! అలా అలలైన ప్రేమికులకు ఎటువంటి హద్దులు ,అడ్డులు లేవనీ చిత్రంలో చెప్పాడు భారతీ రాజా !చిత్రం అంతా వైవిధ్యమైన సన్నివేశాలతో సాగుతుంది. ముఖ్యంగా కోటయ్య పాత్రలో నటించిన రాళ్ళపల్లి స్మిత పాత్రను ఉద్దేశించి ‘కూలి ఆమెకు ఇవ్వండి … పాపం …. నిలబడి నిలబడి ఆమె కష్టపడింది’ అన్నప్పుడు ప్రేక్షకుల్లో వచ్చిన ఆనందం అమోఘం ! ఈ చిత్రానికి తెలుగులో నేషనల్ అవార్డ్ వచ్చింది …. తమిళ్ లో కన్నా తెలుగులో అద్భుతంగా తీసారు ….. తమిళ్ కన్నా తెలుగు పాటలే నృత్యాలు చేసాయి తెరపై ! తన ప్రేమ కథలలో సామాజిక నేపధ్యం సరికొత్తగా పరిచయం చేస్తాడు.
భారతీరాజా ప్రేమను కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధంగా చూపించలేదు. ప్రేమ చుట్టూ ఉన్న సామాజిక వ్యవస్థలను కూడా ప్రశ్నించాడు. సీతాకోకచిలుకలో ప్రేమకు అడ్డుగా నిలిచే కుల, మత భేదాలు కనిపిస్తాయి. అదే చిరంజీవి నటించిన ఆరాధనలో ప్రేమతో పాటు త్యాగం, ఆత్మీయత, కుటుంబ బంధాల విలువ కనిపిస్తుంది. ఆరాధన చిత్రంలో ప్రకృతి, సంగీతం, ప్రేమ, బాధ — ఇవన్నీ కలిసిపోయి ఒక భావోద్వేగ అనుభూతిని కలిగిస్తాయి. భారతీరాజా ప్రేమ కథలను తెరకెక్కించిన విధానం చూస్తే ఆయనకు మానవ భావోద్వేగాలపై ఎంత లోతైన అవగాహన ఉందో తెలుస్తుంది.
చాలామందికి భారతీరాజా అంటే గ్రామీణ ప్రేమకథల దర్శకుడిగానే గుర్తుంటారు. కానీ ఆయన ప్రతిభ అంతటితో ఆగిపోలేదు. ఎర్ర గులాబీలు చిత్రంలో పూర్తిగా భిన్నమైన భారతీరాజాను చూస్తాం. ఈ చిత్రాన్నిఓ సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఒక వ్యక్తి మానసిక వికృతిని, అతని అంతర్మథనాన్ని, సమాజంపై అతని దృష్టిని దర్శకుడు ఎంతో నైపుణ్యంగా ఆవిష్కరించాడు. ఈ చిత్రంలో కెమెరా యాంగిల్స్, లైటింగ్, షాడోస్ వినియోగం హాలీవుడ్ స్థాయి నైపుణ్యాన్ని గుర్తు చేస్తుంది. భారతీరాజా కేవలం గ్రామీణ కథల దర్శకుడు మాత్రమే కాదని,సైకలాజికల్ థ్రిల్లర్ జానర్నైనా సమర్థంగా రూపొ౦ది౦చగల దర్శకుడని ఈ చిత్రం నిరూపించింది.
విజువల్ స్టోరీ టెల్లింగ్ లో ఆయన్ను అందరూ మెచ్చుకుంటారు. దర్శకుడి గొప్పతనం సంభాషణల్లో కాదు… దృశ్యాలతో కథ చెప్పడంలో ఉంటుంది. భారతీరాజా ఈ కళలో మాస్టర్! ‘టిక్ టిక్ టిక్ ‘చిత్రంలో ఆయన విజువల్ నేరేషన్ స్పష్టంగా ఈ విషయం చెబుతుంది. చాలా సందర్భాల్లో మాటలు అవసరం లేకుండా, కేవలం ఫ్రేమ్ కంపోజిషన్ ద్వారా పాత్రల భావాలను ప్రేక్షకులకు చేరవేస్తారు. ఆయన సినిమాల్లో లాంగ్ షాట్లు, నేచురల్ లొకేషన్లు, లైట్స్ వాడకం ప్రత్యేకంగా కనిపిస్తాయి. ‘ఓ నటన మయూరి వయ్యారి’ పాటలో ఆయన చేసిన సిన్ డివిజన్ అదరహో అనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న సస్పెన్ థిల్లర్స్ నలబై ఏళ్ళ క్రితమే ఆయన తీసారు. అంటే ఇప్పటి దర్శకుల ఆలోచనకు ఆయన చాలా ముందుగా ఉన్నారనే అనుకోవాలి.. మిస్ ఇండియా , మిస్ యూనివర్స్ లాంటి అందాల భామల పోటీల వెనుక జరుగుతున్న మాఫియా ముటాల ఆగడాలు అప్పుడే ఆయన సినిమాల ద్వారా హెచ్చరించాడు.
భారతీరాజా సామాజిక సంస్కర్తగా అనేక చిత్రాలు నిరూపిస్తాయి. భారతీరాజా సినిమాల్లో అత్యంత శక్తివంతమైన అంశం సామాజిక విమర్శ. వేదం పుదిదు ఆయన కెరీర్లో అత్యంత ధైర్యవంతమైన చిత్రాల్లో ఇది ఒకటి. కులవ్యవస్థ, మత ఆధిపత్యం, సామాజిక వివక్షలను ఈ చిత్రం తీవ్రంగా ప్రశ్నిస్తుంది. సినిమా విడుదలైన కాలాన్ని పరిశీలిస్తే, ఇలాంటి అంశాలను తెరమీదకు తీసుకురావడం ఎంతో సాహసోపేతమైన నిర్ణయం. ఇక్కడ భారతీరాజా దర్శకుడిగా మాత్రమే కాదు, ఒక సామాజిక చైతన్యవేత్తగా కనిపిస్తాడు. ఆయన సందేశం స్పష్టంగా ఉంటుంది. “మనిషి విలువ అతని జన్మలో కాదు… అతని మానవత్వంలో ఉంది.” ఇదే మాట వేదం పుదిదు చిత్రానికి శాశ్వత గుర్తింపును ఇచ్చింది. కొత్త వేదాలను ప్రజలకు పరిచయం చేసాడు. నవీన యుగానికి నాంది పలికాడు. ప్రేక్షకుల్లో క్రాంతదర్శిగా గుర్తింపు పొందారు.
ఆయనలో మరో కోణం కుటుంబ అనుబంధాల చిత్రకారుడుగా కనిపిస్తాడు. ఆత్మబంధువు వంటి చిత్రాల్లో భారతీరాజా కుటుంబ విలువలను హృద్యంగా చూపించారు. కట్టుకున్న భార్య అందించలేని ఆదరణ చూపిన చూపిన అమ్మాయి, తనకు తాయ్ మడి అనే తల్లి ఒడి అందించిందని హీరో భావనను చాలా సున్నితంగా చిత్రీకరించిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. భావోద్వేగాలను అతిగా నాటకీయంగా చూపకుండా సహజంగా ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. అందుకే ప్రేక్షకులు ఆయన సినిమాల్లో తమ జీవితాలను చూసుకుంటారు.
కొత్త జీవితాలు చిత్రంలో ఆయన అన్ని కొత్త ఆలోచనలే చేసారు. యువత ఆశయాలు, మారుతున్న సమాజం, కొత్త సంబంధాల గురించి ఎంత సున్నితంగా ఆలోచించారో తెలుస్తుంది. రెండు హృదయాల మధ్య ఉన్న పాత పద్దతులు …… కొత్త ఆలోచనలు ఈ చిత్రంలో వైవిధ్యంగా చిత్రీకరించాడు. మధ్యలో వచ్చిన సునామీ లాంటి పరిస్థితులు తట్టుకుని యువత తమ జీవితాలను ఎలా తీర్చి దిద్దుకోవాలో చెప్పారు. ఆయన కథల్లో పాత్రలు నెగటివ్ పాజిటివ్ అంశాలతో ఉండవు. ప్రతి పాత్రలో మంచితనం, బలహీనత రెండూ ఉంటాయి. అదే వాటిని నిజ జీవితానికి దగ్గర చేస్తుంది.
ఆయన దర్శకత్వ విలువల్లో కొన్ని ముఖ్యాంశాలుగా పరిశీలిస్తే ……..ప్రకృతి ఒక పాత్రగా ఉంటుంది…..భారతీరాజా సినిమాల్లో ప్రకృతి కేవలం అందం కోసం ఉండదు. కథలోనే భాగమవుతుంది. అన్ని పాత్రలు సహజ నటన ప్రదర్శిస్తాయి. అవి నటిస్తున్నట్టు కాకుండా జీవిస్తున్నట్టు కనిపిస్తాయి. ఇవి భారతీరాజా దర్శకత్వ శైలిగా ఇప్పటి దర్శకులు కొనసాగిస్తున్నారు. అనేక మంది కళాకారులను పరిశ్రమకు పరిచయం చేసి, కొత్త ప్రతిభకు అవకాశం ఇచ్చారు. ప్రతిభ ఉంటే చాలు …… ఆయా నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిశ్రమకు పరిచయం చేశారు. భారతీ రాజా చిత్రాలలో బలమైన మహిళా పాత్రలు ఉంటాయి. ఆయన కథల్లో మహిళలు కేవలం అలంకార ప్రాయమైన పాత్రలు కావు. కథను ముందుకు నడిపే శక్తులుగా తీర్చి దిద్దాడు.
ప్రతి చిత్రం లోనూ సామాజిక స్పృహ తప్పని సరిగా ఉంటుంది. ప్రేమకథలోనూ, కుటుంబ కథలోనూ, థ్రిల్లర్‌లోనూ సమాజంపై వ్యాఖ్యానం ఉంటుంది. భారతీరాజా సినిమాలను చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆయన కెమెరా గ్రామాన్ని చిత్రీకరించలేదు…గ్రామం ఆత్మను చిత్రీకరించింది. ఆయన ప్రేమకథలను చెప్పలేదు… ప్రేమకు అడ్డుగా నిలిచిన గోడలను ప్రశ్నించాడు. ఆయన పాత్రలను సృష్టించలేదు…మన చుట్టూ ఉన్న మనుషులనే తెరమీద ప్రతిబింబించాడు. సీతాకోకచిలుకలో అమాయక ప్రేమను, ఎర్ర గులాబీల్లో మానసిక చీకటిని, ఆరాధనలో ఆత్మల భావోద్వేగాలను, ఆత్మ బంధువులో కుటుంబ విలువలను, వేదం పుదిదులో సామాజిక విప్లవాన్ని చూపించిన దర్శకుడు భారతీరాజా.
అందుకే ఆయన కేవలం ఒక దర్శకుడు కాదు… భారతీయ సినీ చరిత్రలో ఒక పాఠశాల. అంత గొప్ప సినీ మేధావిని స్మరించుకుంటూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన మన కళ్ళ ముందు సజీవంగానే ఉంటారు. ముందు తరాల దర్శకులకు స్పూర్తిగా నిలుస్తూనే ఉంటారు.
