ఈ పుట్టినరోజు నాకు చాలా ప్రత్యేకం తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ తో పద్మశ్రీ పురస్కార గ్రహీత మాగంటి మురళీమోహన్
తన 86వ పుట్టినరోజు సందర్భంగా “పద్మశ్రీ” పురస్కారాన్ని పొందడం తనకు అనిర్వచనీయమైన
ఆనందానుభూతిని ఇచ్చిందని అన్నారు ప్రముఖ నటులు – నిర్మాత – మాజీ పార్లమెంటు సభ్యులు
మురళీమోహన్. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మురళీమోహన్ ను ప్రత్యేకంగా కలిసి అభినందనలు
తెలిపింది. ఈ కార్యక్రమంలో
ఫిలింక్రిటిక్స్ గౌరవాధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ… సౌమ్యుడు అజాత శత్రువు ఎవ్వరికి అండనివారు ఐన మురళీమోహన్ గారికి పద్మశ్రీ అవార్డు చాలా ఆలస్యంగా వచ్చింది. ఇది ఆయనకు ఎప్పుడో రావలసింది. మురళీమోహన్ గారి పుట్టిన రోజుకు ఒక రోజు ముందు ఈ అవార్డు అందుకోవడం అనేది ఆయనకు పుట్టినరోజు గిఫ్టుల అవుతుంది అన్నారు. అదే విధంగా ఫిలిం క్రిటిక్స్ కార్యవర్గం నిర్వహించి తలపెట్టిన మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని మీరు అనుమతిస్తే పెట్టుకుంటాము అని అన్నారు.

ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల ప్రసాదరావు మాట్లాడుతూ.. 58 ఏండ్ల చరిత్ర గలిగిన ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ ను .. తొలితరం జర్నలిస్టులు పి,యస్. ఆర్. ఆంజనేయశాస్త్రి, గుడిపూడి శ్రీహరి తదితరులు స్థాపించారు. కొన్నాళ్ళుగా స్థబ్దుగా ఉన్న అసోసియేషన్ ఈ మధ్యనే పున: ప్రారంభమైంది. ఎన్నో కార్యక్రమాలు తలపెట్టి చేస్తున్నాము.
అందులో భాగంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నిర్వహించబోయే మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి రావడానికి మురళీ మోహన్ గారు సుముఖత వ్యక్త పరిచినందుకు ఆనందంగా ఉంది అన్నారు.
ఫిలిం క్రిటిక్స్ ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి మాట్లాడుతూ .. సినిమా పరిశ్రమలోని ప్రతి ఒక్కరు మురళీ
మోహన్ గారికి పద్మశ్రీ పురస్కారం ఆలస్యంగా వచ్చింది అనుకుంటున్నారు. మురళీమోహన్ గారిని యావత్
చిత్ర పరిశ్రమ ఈ సందర్భంగా ఘనంగా సత్కరిస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను అన్నారు.

ఉపాధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఇంత ఆలస్యంగా పద్మశ్రీ వచ్చినప్పటికీ సమర్థుడైన వ్యక్తికి
వచ్చిందని భావిస్తున్నాము. భవిష్యత్ లో మీరు పద్మభూషణ్ కూడా అందుకోవాలని కోరుకుంటున్నాము
అన్నారు.
ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ…. తనను పద్మశ్రీ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమా అభివృద్ధి కోసం విశేషంగా
పాటుపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్
తో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని మురళీమోహన్ నెమరువేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ప్రభు, అధ్యక్షుడు బత్తుల ప్రసాద్, ప్రధాన
కార్యదర్శి సురేష్ కొండేటి, ఉపాధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి, ఉపకార్యదర్శులు శ్రీమతి పర్వీన్బాబి, శ్యామ్, కార్యవర్ద
సభ్యులు ధీరజ్ అప్పాజీ, నవీన్, ఆర్.డి,యస్. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

