గాన గంధర్వుడు బాలు – ఒక సంగీత యుగం

మన తెలుగు పాటకు ఒక మాధుర్యాన్ని, మన భావోద్వేగాలకు ఒక స్వరాన్ని, మన జీవితంలోని ప్రతి సందర్భానికి ఒక పాటను అందించిన మహాగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పాట అంటే బాలు…భావం అంటే బాలు…తెలుగు సినిమా సంగీత చరిత్ర అంటే బాలు…నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సంగీత ప్రస్థానం కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ రోజు మనం గాన గంధర్వుడు, పద్మవిభూషణ్, భారత సంగీత ప్రపంచపు ఆణిముత్యం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జీవిత విశేషాలను తెలుసుకుందాం.

1946 జూన్ 4…నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట అనే చిన్న గ్రామంలో జన్మించిన ఓ బాలుడు, భవిష్యత్తులో భారతదేశ సంగీత ప్రపంచాన్ని శాసిస్తాడని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. ఆ బాలుడే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. హరికథా విద్వాంసుడు సాంబమూర్తి గారి కుమారుడిగా జన్మించిన బాలు గారికి సంగీతం అంటే ఇష్టం చిన్ననాటి నుంచే ఏర్పడింది. ఇంట్లో సంగీత వాతావరణం…తండ్రి కళాప్రేమ…సాహిత్య చర్చలు… ఇవన్నీ చిన్న బాలుపై గొప్ప ప్రభావం చూపించాయి. చదువులోనూ, ఆటల్లోనూ ముందుండే బాలు గారు, స్కూల్ రోజుల నుంచే పాటలు పాడుతూ అందరి ప్రశంసలు అందుకునేవారు.

1964లో గాయకుడిగా తొలి అడుగు పడింది. ఓ సంగీత పోటీలో ఆయన ప్రతిభను గుర్తించిన సంగీత దర్శకుడు కోదండపాణి గారు, సినిమాల్లో అవకాశం ఇస్తానని మాటిచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. 1966లో విడుదలైన “శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న” సినిమాతో బాలు గారు సినీ గాయకుడిగా పరిచయమయ్యారు. అదే మొదలు…తాను పాడిందే పాటగా ఆయన ప్రస్థానం సాగింది. ఆయనకు అవకాశాలు వరుసగా వచ్చాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ… భాష ఏదైనా…భావం ఏదైనా…బాలు గారి స్వరం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. సంగీత ప్రపంచంలో అజరామర ప్రస్థానం సాగించారు. ఒక గాయకుడు వేల పాటలు పాడటం గొప్ప విషయం. కానీ బాలు గారు మాత్రం 40 వేలకుపైగా పాటలు పాడి ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రేమ గీతం అయినా… భక్తి గీతం అయినా…విరహ గీతం అయినా…ఉత్సాహభరితమైన పాట అయినా…అన్ని రకాల పాటలకు ఆయన స్వరం ప్రాణం పోసింది. ప్రత్యేకంగా ఒక నటుడి హావభావాలకు తగ్గట్టుగా పాట పాడడం ఆయన ప్రత్యేకత. అందుకే అనేక మంది హీరోలకు ఆయన స్వరం శాశ్వత గుర్తింపుగా నిలిచిపోయింది.

నటుడిగా – డబ్బింగ్ కళాకారుడిగా రాణించారు. గాయకుడిగానే కాదు…నటుడిగానూ బాలు ప్రేక్షకులను అలరించారు. “ప్రేమ”, “పవిత్ర బంధం”, “రక్షకుడు”, “మిథునం” వంటి చిత్రాల్లో ఆయన నటన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా “మిథునం” సినిమాలో ఆయన నటన ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. ఇక డబ్బింగ్ కళాకారుడిగా కూడా ఆయన అసాధారణ ప్రతిభ కనబరిచారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖ నటులకు ఆయన గాత్రదానం చేశారు. ఆయా పాత్రలకు ఆయన స్వరం మరో అందాన్ని తీసుకొచ్చింది. సినిమాలకే పరిమితం కాకుండా…బుల్లితెరపై బాలు తన ప్రతిభను చూపారు. టెలివిజన్ రంగంలో కూడా బాలు గారు ఒక కొత్త చరిత్ర సృష్టించారు. “పాడుతా తీయగా” కార్యక్రమం ద్వారా ఎన్నో కొత్త గాయకులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ కార్యక్రమం కేవలం పోటీ మాత్రమే కాదు…అది ఒక సంగీత పాఠశాల. ఒక గురుకులం. ఒక సంగీత కుటుంబం. ఎంతో మంది యువ గాయకుల విజయానికి బాలు గారే మార్గదర్శకులు అయ్యారు.
ఆయన ప్రతిభకు దేశం మొత్తం తలవంచింది. అనేక పురస్కారాలు ఆయన్ను వరించి తమ గౌరవాన్ని కాపాడుకున్నాయి. ఆరు జాతీయ పురస్కారాలు… అనేక ఫిల్మ్ ఫేర్ అవార్డులు…
అనేక నంది అవార్డులు…పద్మశ్రీ… పద్మభూషణ్…మరియు మరణానంతరం పద్మవిభూషణ్…తదితర విభూషణాలన్ని ఆయన్ను వరించాయి. ఇవి అన్నీ ఆయన కృషికి వచ్చిన గుర్తింపులు మాత్రమే. కానీ ప్రజల హృదయాల్లో సంపాదించిన స్థానం మాత్రం అవార్డులకు అతీతం. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టిన వార్త విన్న ప్రతి సంగీతాభిమాని కన్నీటి పర్యంతమయ్యాడు. ఒక స్వరం మౌనమైంది… కానీ ఆ స్వరం సృష్టించిన మాధుర్యం మాత్రం శాశ్వతమైంది. పాట ఉన్నంతకాలం…తెలుగు సినిమా ఉన్నంతకాలం… సంగీతాభిమానులు ఉన్నంతకాలం…బాలు గారు మన మధ్యే ఉంటారు….. ఉన్నారు! ఆయన పాడిన ప్రతి పాటలో…ఆయన నవ్వులో…ఆయన నేర్పిన ప్రతి సంగీత పాఠంలో…మన బాలు చిరంజీవిగా నిలిచిపోతారు. గాన గంధర్వుడు…సంగీత సరస్వతి పుత్రుడు…ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి మన హృదయపూర్వక నివాళులు.
