డార్క్ సైకాలజికల్ హారర్ చిత్రం “అబ్సెషన్” హాలివుడ్ మూవీ సమీక్ష

ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా సాధారణ హారర్ మూవీ కాదు. ప్రేమ, మోజు, స్వార్థం, అతీంద్రియ శక్తులు, మానసిక భయం – ఈ ఐదు అంశాలను కలిపి ప్రేక్షకుడిని అసౌకర్యానికి, భయానికి గురిచేస్తూనే ఆలోచింపజేసే ఒక డార్క్ సైకాలజికల్ హారర్ చిత్రం. ఆ సినిమానే ‘అబ్సెషన్’ . సాధారణంగా ప్రేమ కథల్లో హీరో తన ప్రేమను గెలుచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఒకవేళ ప్రేమను సహజంగా కాకుండా బలవంతంగా సంపాదించుకుంటే ఏమవుతుంది? ఒక మనిషి కోరిక మరొకరి స్వేచ్ఛను పూర్తిగా నాశనం చేస్తే దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయి? అనే ప్రశ్నకు ఈ సినిమా సమాధానం చెబుతుంది.
కథలో ప్రధాన పాత్ర బేర్. అతను ఒక మ్యూజిక్ స్టోర్‌లో పని చేసే సాధారణ యువకుడు. తన సహోద్యోగి, స్నేహితురాలు నిక్కీపై అతనికి చాలా కాలంగా ప్రేమ ఉంటుంది. అయితే ఆ ప్రేమను బయటపెట్టే ధైర్యం మాత్రం ఉండదు. నిక్కీ తనను ప్రేమించాలనే కోరికతో అతను ఒక అతీంద్రియ బొమ్మను ఉపయోగించి కోరిక కోరతాడు. ఇక్కడి నుంచే కథ అసలు రూపం దాల్చుతుంది. మొదట్లో నిక్కీ ప్రవర్తనలో వచ్చిన మార్పులు బేర్‌కు ఆనందాన్ని కలిగిస్తాయి. తన కల నెరవేరిందని భావిస్తాడు. కానీ క్రమంగా ఆ ప్రేమ సాధారణ ప్రేమ కాదని, అది ప్రమాదకరమైన మోజుగా మారిందని అతనికి అర్థమవుతుంది. ఈ సినిమాలో అత్యంత బలమైన అంశం ఏమిటంటే – ప్రేమను ఒక అందమైన భావోద్వేగంగా కాకుండా, నియంత్రణ కోల్పోయినప్పుడు అది ఎంత భయంకరమైన రూపం దాల్చుతుందో చూపించడం. దర్శకుడు కర్రీ బార్కర్ కథను చాలా తెలివిగా నిర్మించాడు. మొదటి భాగంలో ఒక సాధారణ రొమాంటిక్ డ్రామా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. కానీ రెండో భాగం మొదలైన తర్వాత సినిమా ఒక్కసారిగా భయానకమైన మలుపులు తిరుగుతుంది.
నిక్కీ పాత్రలో కనిపించిన నటి౦చిన ఇండే నవర్రేట్టి సినిమాకు అతిపెద్ద బలం. ఆమె పాత్రలో ఒకే సమయంలో ప్రేమ, బాధ, పిచ్చి, కోపం, అసహాయం అన్నీ కనిపిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో ఆమె కళ్లలో కనిపించే భావోద్వేగాలు ప్రేక్షకుడికి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.సాధారణంగా హారర్ సినిమాల్లో భయపెట్టడానికి జంప్ స్కేర్స్ను ఉపయోగిస్తారు. కానీ ఈ చిత్రంలో భయం వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రేక్షకుడు దెయ్యాన్ని చూసి భయపడడు. ఒక మనిషి ప్రేమ అనే భావన ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూసి భయపడతాడు. ప్రేమను చూసి భయపడడం ఓ కొత్త కోణం!

సినిమాలోని అనేక సన్నివేశాలు చాలా డిస్టర్బింగ్‌గా ఉంటాయి. ముఖ్యంగా నిక్కీ క్రమంగా తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఒక మోజు బానిసగా మారడం చాలా బాధాకరంగా చూపించారు. ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన సందేశం కూడా దాగి ఉంది. మనిషి ప్రేమను సంపాదించవచ్చు. కానీ ప్రేమను బలవంతంగా పొందలేడు. ఎవరైనా మనల్ని ప్రేమించాలని కోరుకోవచ్చు. కానీ వారి స్వేచ్ఛను తీసేసి ప్రేమను పొందాలని ప్రయత్నిస్తే అది ప్రేమ కాదు. అది స్వార్థం. బేర్ పాత్ర ద్వారా దర్శకుడు ఇదే విషయాన్ని చెబుతాడు. మొదట్లో అతని కోరిక చిన్నదిగా కనిపించినా, ఆ కోరిక వల్ల ఎంత మంది జీవితాలు నాశనం అయ్యాయో సినిమా చూపిస్తుంది.
సాంకేతికంగా కూడా సినిమా చాలా బాగుంది. కెమెరా వర్క్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అనేక సన్నివేశాల్లో కెమెరా ఫ్రేమింగ్ ప్రేక్షకుడికి ఒంటరితనం, అసౌకర్యం కలిగించేలా ఉంటుంది. అందువల్ల కథలోని మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా హారర్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషించింది. కొన్ని చోట్ల సంగీతం లేకపోవడమే భయాన్ని పెంచుతుంది. మరికొన్ని చోట్ల సంగీతం ప్రేక్షకుడి మనసులో ఉద్రిక్తతను సృష్టిస్తుంది. సినిమాలోని హింసాత్మక సన్నివేశాలు కథకు అవసరమైన మేరకే ఉపయోగించారు. అవి కేవలం షాక్ ఇవ్వడానికి కాకుండా పాత్రల మానసిక స్థితిని తెలియజేయడానికి ఉపయోగపడ్డాయి.
క్లైమాక్స్ విషయానికి వస్తే…చివరి ఇరవై నిమిషాలు ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెడతాయి. బేర్ తన తప్పును సరిదిద్దుకునేందుకు చేసే ప్రయత్నాలు, నిక్కీలో జరుగుతున్న అంతర్మథనం, ఒక్కో సంఘటన ఊహించని విధంగా జరుగుతూ కథను విషాదాంతం వైపు తీసుకెళ్తాయి. ముఖ్యంగా ముగింపు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ప్రేమ కోసం మొదలైన ప్రయాణం చివరకు పశ్చాత్తాపం, మరణం, విషాదంతో ముగుస్తుంది. ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా సినిమా గురించి ఆలోచించేలా చేస్తుంది.
ఈ చిత్రం అందరికీ నచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. ఎందుకంటే ఇందులో ఉన్న హారర్ కంటే ఎక్కువగా మానసిక అసౌకర్యం ఉంటుంది. కానీ కొత్త తరహా కథలను ఇష్టపడేవారికి, సైకాలజికల్ హారర్ అభిమానులకు మాత్రం ఇది తప్పకుండా చూడదగిన సినిమా. ఇక మొత్తంగా చెప్పాలంటే…అబ్సెషన్ అనేది ప్రేమ కథ ముసుగులో వచ్చిన ఒక భయంకరమైన హెచ్చరిక. ప్రేమకు స్వేచ్ఛ అవసరం, మోజుకు నియంత్రణ అవసరం, కోరికలకు హద్దులు అవసరం అని ఈ చిత్రం చెబుతుంది. హద్దులు దాటిన ప్రేమ కూడా ఒక శాపంగా మారుతుందని చూపించిన చిత్రం ఇది.
