ఆకట్టుకున్న మహి వీ రాఘవ్ యాత్ర 2 మూవీ రివ్యూ…


మహి వీ రాఘవ్ తీసిన యాత్ర తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర ఆధారంగా యాత్రను తీసిన మహి.. వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర నేపథ్యాన్ని తీసుకుని యాత్ర 2 తీశాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.

కథ
2009లో వైఎస్సార్ (మమ్ముట్టి) తన కొడుకు జగన్‌ (జీవా)ను ప్రజలకు పరిచయం చేయడం, రెండోసారి విజయం సాధించడంతో ‘యాత్ర 2’ మొదలౌతుంది. వైఎస్ఆర్ చనిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ (సినిమాలో ప్రోగ్రెస్ పార్టీ అని చూపిస్తారు) జగన్‌ని కాదని రోశయ్యని ముఖ్యమంత్రిని చేస్తుంది. జగన్ సీఎం కావాలని ఎమ్మెల్యేలంతా సంతకాలు సేకరించినా కూడా అధిష్ఠానం పట్టించుకోదు. వైఎస్ మరణవార్తతో దాదాపు 660 మంది చనిపోవడంతో.. వాళ్లని పరామర్శించడం కోసం జగన్ ఓదార్పు యాత్ర చేపడతారు. ఆ యాత్రను ఆపేందుకు అధిష్టానం ప్రయత్నిస్తుంది. కానీ జగన్.. వారికి ఎదురొడ్డి నిలబడతారు. ఇచ్చిన మాటకి కట్టుబడి మొండిగా ఓదార్పు యాత్రను చేపడతాడు. దీంతో ఆగ్రహం చెందిన కాంగ్రెస్ పార్టీ జగన్‌పై చర్యలకు సిద్ధం కావడం.. ఆ పార్టీకి రాజీనామా చేయడం, కొత్తగా వైఎస్ఆర్ పార్టీని ఏర్పాటు చేయడం వంటివి జరుగుతాయి. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీని ఎలా ఢీ కొట్టాడు?. తెలుగుదేశం పార్టీ (సినిమాలో తెలుగునాడు)ని అధికారానికి దూరం చేసి.. 2019 ఎన్నికల్లో అఖండ విజయాన్ని ఎలా సాధించగలిగారు? అనేది థియేటర్లో చూడాల్సిందే.

నటీనటులు
యాత్ర 2 అంతా కూడా జగన్ (జీవా) పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అడుగడుగునా జగన్ హీరోయిజం, ఎవ్వరికీ తలవంచని గుణం, ఇచ్చిన మాటకు కట్టుబడే గుణాన్ని చూపించారు. జగన్‌గా జీవా అద్భుతంగా నటించేశాడు. జగన్‌లా నడవడం, హావభావాలు పలికించడం, ఆ పాత్రలోని హుందాతనాన్ని జీవా చక్కగా పలికించాడు. జీవా తన నటనతో ప్రేక్షకుల్ని కదిలించాడు. ఇక మమ్ముట్టి కనిపించేది కొద్ది సేపే అయినా అద్భుతంగా అనిపిస్తుంది. వైఎస్సార్ పాత్రలోని హుందాతనాన్ని, గొప్పదనం ఉట్టిపడేలా నటించేశాడు మమ్ముట్టి. చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్ ఇలా ఎవరి పాత్రలకు వారు తగిన న్యాయం చేశారు.

విశ్లేషణ
వైఎస్ జగన్ లాంటి డైనమిక్ లీడర్, ఆయన చేసిన పాదయాత్రను కాన్సెప్ట్‌గా ఎంచుకుని సినిమా తీయాలనే థాట్‌కే మహి వీ రాఘవకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇలాంటి సినిమాలు తీయడం అంటే కత్తి మీద సాము అన్నట్టుగా ఉంటుంది. ఒకరిని హీరోని చేయడం కోసం ఇంకొకర్ని విలన్ చేయాలనే సూత్రాన్ని మహి వీ రాఘవ ఎంచుకోలేదు. ఒకరి మంచిని చెప్పాలంటే.. ఇంకొకరి చెడు చెప్పాల్సిన పని లేదన్న ఫార్మూలాతోనే యాత్ర 2ను మలిచాడు.

ఓ తండ్రి.. తండ్రికి ఇచ్చిన మాట కోసం నిలబడే కొడుకు.. అనే పాయింట్‌తో సినిమాను ఫుల్ ఎమోషనల్‌గా చూపించాడు. ఈ చిత్రంలో ఎక్కడా కూడా ఎవ్వరినీ తక్కువ చేసి చూపించకపోవడం, ఎవ్వరినీ కించపర్చకపోవడం మహి వీ రాఘవలోని రైటింగ్, మేకింగ్, టేకింగ్‌, టాలెంట్‌కు, గొప్పదనంకు నిదర్శనం. కేవలం వైఎస్ జగన్ పాత్రను ఎంతలా ఎలివేట్ చేయగలడో, ఎంత బాగా చూపించగలడో అంత బాగా చూపించేశాడు.

తెలిసిన కథను రెండు గంటల సేపు థియేటర్లో కూర్చోబెట్టి చూపించేలా చేయడం అంటే ఆశామాషీ వ్యవహారం కాదు.కానీ మహి వీ రాఘవ ఆ సాహసం చేశాడు. తెలిసిన కథను ప్రేక్షకుడికి ఎంతో అందంగా, ఎంతో ఎమోషనల్‌గా టచ్ చేస్తూ చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. మహికి అండగా తన టెక్నికల్ టీం నిలిచింది. మాటలు ఈ చిత్రాన్ని నిలబెట్టేశాయి. ఒక్కో డైలాగ్ వింటుంటే..అది కలంలోంచి కాదు గుండెల్లోంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. విజువల్స్ సినిమాకు పెద్ద ఎస్సెట్. ఆర్ఆర్ సినిమాకు బ్యాక్ బోన్‌లా నిల్చింది. అన్ని డిపార్ట్మెంట్లు అద్భుతం చేశాయి. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నత స్థాయిలో అనిపిస్తాయి.

వైఎస్ జగన్ అభిమానులను ఈ చిత్రం కట్టి పడేస్తుంది. సాధారణ సినీ ప్రేమికుడ్ని సైతం యాత్ర 2 ఇట్టే ఆకట్టుకుంటుంది. ఓ ఎమోషనల్ జర్నీలా యాత్ర 2 సాగుతుంది.

మామూవీ.కామ్ రివ్యూ అండ్ రేటింగ్ : 3.25/5

About Author

Maa Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *