హాస్యం జోలికి పోకుండా మూడు గంటల పాటు ప్రేక్షకుణ్ణి కూర్చోబెట్టడం కత్తి మీద సామే “పెద్ది” మూవీ రివ్యూ…

యాంకర్ —-గుర్తింపు …గుర్తింపు …. నువ్వు ఎవరో తెలియాలంటే గుర్తింపు కావాలి ….. లేదా నువ్వు ఎవరో అన్న విషయాన్ని నువ్వే నిరూపించుకోవాలి! అలా కాకపోతే మనిషిగా నువ్వు పుట్టనట్టే, పుట్టినా ఓడిపోయినట్టే! ఈ విషయాన్ని ఒప్పుకోలేని ఓ గుర్తింపు లేని కొండ కింద చిన్న పల్లె చేసిన పోరాటమే పెద్ది. పల్లె అంటే గుడిసెలు కాదు మనుషులు ….. వారు మనుషులె కాని వారికి ఎటువంటి గుర్తింపు లేదు. ప్రభుత్వం ఆ పల్లెను మనుషులుండే ఊరుగా గుర్తించలేదు. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందే అన్ని రకాల సౌకర్యాలు వారికి లేవు. కనీసం కొండ మీద నుండి పోతున్న రైలు బండిని నైనా ఆపుకుంటే ….. ఆ పల్లె ఉనికి ప్రపంచానికి తెలుస్తుందని పల్లె ప్రజల పోరాట పటిమే పెద్ది! పల్లె ప్రజల పోరాటానికి ఆయుధమైన వాడు పెద్ది. ఉండడానికి పెద్ది చిన్నపేరైనా, అతనికి ఉన్న శక్తి పెద్దది. బెల్లం బట్టిల్లో కూలి కోసం పని చేస్తూ….. అదనపు కూలి కోసం క్రికెట్ ఆటను ఎవరికోసమైనా ఆడతాడు. ఎవరు తనను డబ్బు పెట్టి పాడుకుంటారో , ఆ జట్టు విజయం కోసం కొట్టిన బంతిని ఆ పరగణాలు దాటి౦చగలడు. ఆటే అతని ఆయుధం ….. ఆటే అతని శక్తి ! పల్లెకు గుర్తింపు లేకపోవడం మైనస్. పెద్దికి ఆటలో అద్భుతమైన ప్రతిభ ఉండడం ప్లస్ ! ఈ ప్లస్ మైనస్ లను రెంటిని సమన్వయ౦ చేస్తూ దర్శకుడు బుచ్చి బాబు రాసుకున్న కథ తెరపై ఎంత బాగా పండించాదన్నదే పెద్ది లో మనం చూడాల్సింది.

మన తెలుగు చిత్రాలలో స్పోర్ట్ప్ డ్రామాతో ఓ కథ రాసుకోవడం సులభం. అల్లాంటి కథను తెరపై మెప్పించడం కష్టంతో తో కూడుకున్న ఫీట్! ఎందుకంటే…ఇలాంటి కథలు ఎలా ఉంటాయో ఓ అవగాహన ప్రేక్షకుడికి ఉంటుంది. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామాలన్నీ ఒకేలా సాగుతుంటాయి. ఓ ఆటగాడి ప్రయాణం.. పతనం… పరాభవం.. అంతిమంగా విజయం. ఇదే ఏ స్పోర్ట్స్ డ్రామా చూసినా కనిపించే ప్రధానమైన విషయాలు. అందుకే ప్రతీసారీ అలవాటైన కథనంతో ప్రేక్షకుణ్ణి మెప్పించడం కష్టం. మన దగ్గర అయితే ఇలాంటి సినిమాలు చేయడమే మానేశారు. పెద్ద హీరోలు కమర్షియల్ కథలో పడిపోయి ఇలాంటి వాటిని టచ్ చేయడమే మానుకున్నారు. అలాంటిది రామ్ చరణ్ లాంటి ఓ స్టార్, బుచ్చిబాబు అనే ఓ కొత్త దర్శకుడికి అలాంటి ఛాన్స్ ఇచ్చి, స్పోర్ట్స్ డ్రామాతో చిత్రం చేసాడంటే కచ్చితంగా ఆ సినిమా గురించి చెప్పుకోవాల్సిందే. అలా ‘పెద్ది’ అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నాడు. అందుకు తోడు ‘పెద్ది’ కి ముందు నుంచీ అన్నీవిషయాలు కలిసొచ్చేశాయి. మొదటి నుండి వెండి తెరపై ఈ సినిమా ఏదో చేయగలదన్న నమ్మకాన్ని మాత్రం సడలి పోనివ్వలేదు. అలాంటి ఈ నమ్మకాలు ఏమయ్యాయి? స్పోర్ట్స్ నేపధ్య కథనంగా కనిపి౦చిన కథను దర్శకుడు బుచ్చిబాబు ప్రేక్షకుల కోసం ఎంత రసవత్తరంగా కథ, కథనాలు రాసుకున్నాడు? అవి ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అయ్యాయి అనేది విషయాలను చూద్దాం.
కథలోకెళితే …….విజయనగరం జిల్లాలో కొండ కింద ఓ ఊరుంది. ఆ ఊరికంటూ పేరేం లేదు. ఎందుకంటే ఆ ఊరినీ, అక్కడి జనాన్నీ ప్రభుత్వం గుర్తించలేదు. అక్కడెవరికీ ఓటు హక్కు లేదు. గుర్తింపు లేదు. బస్సు లేదు. ట్రైన్ ఆగదు. ఊర్లో ప్రాణాలు ఊర్లోనే పోతుంటాయి. ఆ ఊరి మీదుగా వెళ్లే ట్రైన్ ని ఆపాలని అప్పలసూరి (జగపతిబాబు) ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటాడు. అతని గోడు ఎవ్వరూ పట్టించుకోరు. ఆ ఊరి కుర్రాడు పెద్ది (రామ్ చరణ్). బెల్లం బట్టీలో పని చేస్తుంటాడు. ఆట కూలీ కూడా. క్రికెట్ బాగా ఆడతాడు. దాంతో తనని వేలంలో పాడుకొని, జట్టులో ఆడించుకొంటుంటారు. ఓ వైపు అప్పలసూరి రైల్వే తన పల్లె కోసం ఆపే పోరాటం చేస్తుంటే, పెద్ది తన కూలి ఆటలు ఆడేసుకుటాడు. తన పల్లె లో స్టేషన్ కోసం పోరాడుతున్న అప్పల సూరి అదే రైల్వే ట్రాక్ పై పోరాటం చేసి ప్రాణాలు కోల్పోతాడు. అది చూసి చలించిపోయిన పెద్ది.. ఆ ఊరికి రైలుతో పాటు, ఆ ఊరి వాళ్లకు గుర్తింపు కూడా తీసుకురావాలని భావిస్తాడు. అందుకోసం ఏం చేశాడు? తన ఆటతో… తన పోరాటంతో దేశం దృష్టిని తన వైపు ఎలా తిప్పుకొన్నాడు? తన ఊరి సమస్యని ఎలా తీర్చాడు? అనేది మిగిలిన కథ.
హీరోయిజం అంటే ఎలివేషన్లు, ఊరి సమస్య, ఆట, భావోద్వేగాలు, గెలుపోటములు, స్ఫూర్తి, త్యాగం.. ఇలా అన్నీ ఎలిమెంట్స్ తన కథలో ఉండేలా దర్శకుడు చూసుకొన్నాడు. ఇందులో అన్నీ.. కమర్షియల్ హంగులే. అందుకోసమే ఈ కథని అంత బలంగా నమ్మాడు బుచ్చి బాబు. స్పోర్ట్స్ డ్రామాలు మనం ఎన్నో చూసుంటాం. కానీ పెద్దిలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కథ… ఏ ఒక్క ఆటతోనో మొదలవ్వదు.. పూర్తవ్వదు. తొలి భాగమ౦తా క్రికెట్ తెరపై నడుస్తుంది. రెండో సగం నుండి ఆట మారి కుస్తీ గోదాంలోకి దిగితుంది. ఇహ చివర్లో రన్నింగ్ తో విజయం! హీరోకు మొదటి రెండు ఆటల్లో విజయాలు లేవా అంటే ఉన్నాయి….. కాని సినిమా మొదట్లో చెప్పినట్టు నిజమైన క్రీడాకారులు మన దేశంలో ఉన్నారా? అలా ఉంటే వారిలో నిజమైన క్రీడా స్పూర్తి ఉందా? ఎదుటి క్రీడాకారుడు గెలుస్తుంటే ఆనందించే స్పూర్తి ఎంత మందికి ఉంటుంది? ఇలాంటి గెలిచిన విజేతను వెనక్కి లాగే తత్వం ఉంటే , ప్రపంచంలో అధిక జనాభా ఉన్న ఇండియా పసిడి పతకాల పట్టికలో ఎక్కడో కింది స్థానంలో ఉంటుదిఅన్న మాట నిజం ! అదే వెనక్కి లాగే తత్వాన్ని ఇక్కడ పెద్ది ఆటలో గెలిచినప్పుడు , ఘేరో ఓటమిని ఒప్పించగలిగాడుదర్శకుడు. ఇలా మూడు వైవిధ్యమైన క్రీడల్ని తీసుకొన్నాడు బుచ్చిబాబు. ఈ ఆటలన్నీ కలిపి దానికి ‘క్రాస్ ఓవర్ అథ్లెట్’ అనే కొత్త టాగ్ ను తగిలించాడు. రెండు ఆటలను ఒకే సారి ఆడే ఆటగాడు అనే ప్రయోగాన్ని జోడించి ఈ కథ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది ప్రేక్షకుడికి కొత్తగా ఉంది, రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా కాదనిపిస్తుంది. అలా ఆటలను కొత్త కోణంలో మళ్లించే అవకాశం చేసాడు.
స్పోర్ట్స్ అధారిటీ నుండి బొమన్ ఇరానీ… మంచి క్రీడాకారుల కోసం వెదికే నేపద్యంలో హీరోని వెదుక్కుంటూ రావడం, ఆ హీరో కథని ఓ పాత్ర ముక్కలు ముక్కలుగా చెప్పుకొంటూ వెళ్లడం.. ఇదంతా రొటీన్ ఫార్మెటే. కానీ ఇలాంటి కథల్ని ఈ పేట్రన్ లో చెప్పడమే సరైన పద్ధతి అని దర్శకుడు భావించాడు.. ఆ పద్దతిలోనే కథ మొదలైనా, పెద్ది రాక, గ్రౌండ్ లో కొట్టే వెరైటీ సిక్సర్ల మోత, ఆ తరవాత వచ్చే రై రై రారా పాట.. ఇవన్నీ ప్రేక్షకుల్ని ఈజీగానే కథలోకి తీసుకెళ్లిపోతాయి. ఓ వైపు ఊరి బాధ చెబుతూ… అసలైన సంఘర్షణకు దర్శకుడు మొదట్నుంచే బీజం వేసే ప్రయత్నం చేసుకొంటూ వెళ్లాడు. జగపతిబాబు పాత్ర చిత్రంలో బాగా గుర్తు ఉండేది. మొదటి సీన్లలో ఎర్ర జెండా ఊపుతుంటే….. విలనీ షేడ్స్ ఇమేజీ ఉన్న జగపతి బాబుపై నెగిటివ్ ఆలోచన రావడం ప్రేక్షకుని తప్పు కాదు. జగపతిబాబు పాత్ర సినిమాకే హైలెట్ గా తీర్చి దిద్దారు. తెరపై బాగా పండిది. అయితే పోలీస్ స్టేషన్ సీన్, అక్కడ తమకు గుర్తింపు లేదన్న విషయాన్ని హీరో గుర్తించడం, ఆ తరవాత కుస్తీ ఆట నేర్పమని శివ రాజ్ కుమార్ దగ్గరకు వెళ్లడం, ఇంట్రవెల్ బ్యాంగ్ ఇవన్నీ పక్కాగా కమర్షియల్ మీటర్ లోనే ఉంటాయి.
సెకండాఫ్‌లో కుస్తీ ఫైట్ హైలెట్ గా నిలిచింది. క్రాస్ ఓవర్ అథ్లెట్ అన్న పాయింట్ ఇక్కడే ప్రస్తావించాడు దర్శకుడు. ఆ ఫైట్ కంపోజీషన్ బాగా కుదిరింది. రెగ్యులర్ ఫైట్స్ మధ్య.. ఇలాంటి కుస్తీ పోటీ కచ్చితంగా పైసా వసూల్ మూమెంట్ లాంటిదే. ఐటెమ్ పాటపై సరైన శ్రద్ధ పెట్టలేదనిపిస్తుంది. బహుశా.. పాటకు సరైన ఫ్లాట్ ఫామ్ దొరక్కపోవడం వల్ల కుదరలేదేమో? కుస్తీ పోటీల్లో పెద్ది పాల్గొనడం, అక్కడ తనకు తగిలిన ఎదురుదెబ్బతో కథలో మరో మలుపు రావడంతో ప్రీ క్లైమాక్స్ కి ముందు కథ మరింత రసవత్తరంగా మారుతుంది. ముఖ్యంగా ఆసుపత్రి సీన్ లో చరణ్ నటన చక్కగా పండింది. ఇలాంటి సన్నివేశాల్లో కమర్షియల్ హీరోలు నటించడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ చరణ్ మాత్రం చాలా కసిగా, ధైర్యంగా ,సునాయాసంగా చేసేశాడనిపిస్తుంది. మొత్తం సినిమాలో చరణ్ నటనకు ఎక్కువ మార్కులు పడేది ఇక్కడే! దర్శకుడు కూడా ఈ సన్నివేశ౦పై అంతే శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తుంది.
ఢిల్లీ సన్నివేశాలలో మరింత ఎమోషన్ ఉంటే బాగుండేది. క్లైమాక్స్ లో పెద్ది తీసుకొనే నిర్ణయం, ఆ తరవాత తాను ఆడే ఆట.. కచ్చితంగా మనసుల్ని కదిలిస్తుంది. ఓ ఆటగాడు తన ఊరి కోసం ఇంత చేయగలడా? అనేది తలచుకొంటే గుండె బరువెక్కుతుంది. అదే ఫీల్ లో సినిమాకి శుభం కార్డు వేసేశాడు దర్శకుడు. ఫస్టాఫ్ లో కమర్షియల్ హంగులపై ఎక్కువ ఆధారపడిన బుచ్చిబాబు, సెకండాఫ్ లో వాటి జోలికి వెళ్లలేదు. కథకే కట్టుబడి సినిమాని నడిపించేశాడు. అందుకే సెకండాఫ్ కి వచ్చే సరికి చాలా పాత్రలు కనుమరుగైపోతాయి. ఈ సినిమాలో ప్రత్యేకించి విలన్ ఎవరూ ఉండరు. పరిస్థితులు, ఊరి సమస్యే విలన్లుగా కనిపిస్తాయి. ఓ స్టార్ హీరో సినిమా కోసం ఇలాంటి ఎత్తుగడ వేయడం నిజంగా రిస్కే. అందుకు తోడు ఓ డ్రై సబ్జక్ట్ తీసుకుని , హాస్య నటులు , హాస్యం జోలికి పోకుండా మూడు గంటల పాటు ప్రేక్షకుణ్ణి కూర్చోబెట్టడం కత్తి మీద సామే!
అంతర్జాతీయ స్థాయి టోర్నీలలో ఆడడం అంత ఈజీనా అన్నట్టు పెద్ది ప్రతీ టోర్నీలోనూ వెళ్లిపోవడమే మరింత బాగా రాసుకునే సన్నివేశాలు అవసరం! అలా వెళ్ళడం కోసం చేసిన కృషి కూడా ఉంటే స్క్రిప్ట్ బాగుండేది. చరణ్ కెరర్ లో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పలేం కానీ, ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం ప్రతీ ఫ్రేములోనూ కనిపిస్తోంది. దర్శకున్ని, పెద్ది పాత్రపై చరణ్ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. అందుకే పెద్ది కోసం ఎంత కష్టమైనా పడ్డాడు. తన పాత్ర కోసం బాడీని మార్చుకొన్న విధానం, యాక్షన్ ఘట్టాల్లో కనిపించిన తీరుకి మంచి మార్కులు పడతాయి. జాన్వీ కపూర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత మంచిది. మీర్జా పూర్ ఫేమ్ దివ్యాందుని ఈ సినిమా కోసం తీసుకొచ్చారు. తొలి సన్నివేశాల్లో తప్ప.. తాను కనిపించింది లేదు. తన పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడం విచిత్రం. రావు రమేష్ లాంటి నటుల్ని ఒకట్రెండు సీన్లకే పరిమితం చేశారు. శివరాజ్ కుమార్ పాత్ర నడక, నడత సినిమాను మంచి ట్రాక్ లో నడిపించంది.
టెక్నికల్ గా బాగా స్ట్రాంగ్ గా ఉన్న సినిమా ఇది. తెరపై ప్రతీ సీన్ పవర్ ఫుల్ గా కనిపించింది. సాంకేతిక వర్గానికి పడిన లోడ్ ప్రతి సీన్లో కనిపిస్తుంది. కెమెరా వర్క్, ఆర్ట్.. టాప్ క్లాస్. రెహమాన్ పాటలు ముందే హిట్టు. ఆర్.ఆర్ సన్నివేశానికి తగ్గట్టు హై పిచ్ లో సాగింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొత్తగా వినిపించింది. బుచ్చిబాబు ఓ కమర్షియల్ హీరోని పెట్టుకొని, ఇలాంటి కథ రాసుకోవడం మెచ్చుకోదగిన విషయమే. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ క్లైమాక్స్ ని నమ్మి రాయడం, నటించడం ఈ రెండు విషయాల్లో బుచ్చిబాబు ,చరణ్‌ల ధైర్యాన్ని మెచ్చుకోవాలి. మాటలు ధియేటర్లలో బాగా పేలాయి. ఏ ఒక్క చిన్న పాత్ర వేసిన నటున్ని కూడా ఎక్కడా వదలకుండా తనకు కావాల్సిన ఎమోషన్ పండేలా జాగ్రత్తలు తీసున్నాడు, దర్శకుడు.
